
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు అడ్డుకట్ట దాదాపు తొలగిపోయింది. పథకాల అమలుపై సింగిల్ బెంచ్ విధించిన మధ్యంతర నిలుపుదలను తొలగిస్తూ డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఈ రెండు పథకాల అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి జారీ చేసిన ఎనిమిది ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్ వ్యక్తిగత హోదాలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు కాలేదు. దీంతో సింగిల్ జడ్జి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. మంగళవారం జరిగిన విచారణలో ప్రభుత్వ తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ. సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ ఈ పథకాల లబ్ధిదారు కాదని, ఆయనకు వ్యక్తిగతంగా ఎలాంటి హక్కుల భంగం జరగలేదని కోర్టుకు వివరించారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం రూపంలో కాకుండా వ్యక్తిగత హోదాలో పథకాలను సవాల్ చేయడం సమంజసం కాదని వాదించారు.
అదే సమయంలో ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన అంశాలను పిటిషన్‌లో సవాల్ చేసినందున ఈ వ్యవహారంపై విచారణ జరిపే పరిధి డివిజన్ బెంచ్‌కు ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. షాదీముబారక్ తరహా సంక్షేమ పథకాన్ని సుప్రీంకోర్టు కూడా అనుమతించిన విషయాన్ని ఏజీ ప్రస్తావించారు. తెలంగాణలో అమలవుతున్న కళ్యాణలక్ష్మి పథకం కూడా ఇదే తరహాలో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని వివరించారు.
వివాహ వయసుకు వచ్చిన పేద కుటుంబాల యువతులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు బాల్య వివాహాలను నిరోధించడంలోనూ ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనలను పరిశీలించిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ విధించిన మధ్యంతర స్టేను రద్దు చేసింది. దీంతో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుకు ప్రస్తుతం ఉన్న తాత్కాలిక న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయింది.
అయితే ఈ కేసులో ప్రధాన పిటిషన్‌పై తుది నిర్ణయం ఇంకా రావాల్సి ఉంది. తదుపరి విచారణలో హైకోర్టు తీసుకునే నిర్ణయం ఈ పథకాల భవిష్యత్ అమలుపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.