Telangana News: ఇటీవలి కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. అధ్వాన్నంగా మారిన రోడ్లను సరిచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అటు రోడ్ల దుస్థితిపై ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న పంచాయతీరాజ్ శాఖ రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ మేరకు రానున్న మూడు రోజుల్లోగా కొత్త రోడ్డకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు మంత్రి బుధవారంనాడు ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖలోని పలు అంశాలపై హైదరాబాద్‌లో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఎర్రబెల్లి బుధవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలోని పదోన్నతులు, పోస్టింగులు, ఇటీవల పదోన్నతులు పొందిన డిపిఓలు, ఎంపిడీఓలకు పోస్టింగులు, కారోబార్ లు, పంపు మెకానిక్ ల సమస్యలు వంటి పలు అంశాలపై మంత్రి సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగానే దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే మంజూరైన పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. అలాగే కొత్త రోడ్ల కోసం ప్రతిపాదనలను మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులతో మాట్లాడి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. పంచాయతీరాజ్ శాఖలో ఇప్పటికే చేపట్టిన పదోన్నతులు పొందిన 57మంది డిపిఓలు, ఎంపిడిఓలకు ఖాళీలను బట్టి పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఇంజనీరింగ్ విభాగంలోని ఇంజనీర్లకు పదోన్నతులు కల్పించాలని, ఇందుకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేయాలని మంత్రి చెప్పారు.
అలాగే కారోబార్ లు, పంపు మెకానిక్ లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిశీలించి, నిబంధనలకు లోబడి వెంటనే వాటిని పరిష్కరించాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులకు చెప్పారు. మిగిలి ఉన్న అతి కొద్ది వైకుంఠ ధామాలు, డింపింగ్ యార్డులను సాధ్యమైనంత తొందరలో పూర్తయ్యే విధంగా చూడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవ రావు తదితరులు పాల్గొన్నారు.
Also Read..
Viral Video: వీడియో తీయమని ఫోన్ ఇస్తే.. ఈ ఏనుగు ఏం చేసిందో చూశారా ? తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..
Crime News: దారుణం.. ప్రేమించి పెళ్లి చేసుకుందని.. కడుపులో బిడ్డను చంపారు.. బలవంతంగా..