
తెలంగాణలోని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రజలకు మెరుగైన విద్య సౌకర్యాలు కల్పించేందుకు సిద్దమవుతున్న ప్రభుత్వం.. ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన రైతులకు లబ్ది చేకూర్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో వేల మంది గాయాలపాలవుతుండగా.. మరణాలు కూడా ఎక్కువ సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు వైద్య సహాయం అందించేందుకు రూ.1.50 లక్షల వరకు ఉచిత క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ సౌకర్యం కల్పించనుంది. కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన ఈ పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారి చికిత్సకు సాయం అందించేందుకు రూ.1.50 లక్షల ఉచిత వైద్య చికిత్స పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా దేశంలో ఎక్కడైనా రోడ్డు ప్రమాదానికి గురై ఆ లిమిట్ వరకు ఉచిత క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, అస్సాం, చండీఘడ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమలవుతోంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ పథకాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నెట్ వర్క్ ఆస్పత్రులను గుర్తిస్తోంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకంతో కనెక్ట్ అయి ఉన్న నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఈ స్కీమ్ అమలు చేయనుంది. ప్రస్తుతం 500 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలో ఉన్నాయి. ఆ తర్వాత మిగిలిన హాస్పిటల్స్‌కు కూడా విస్తరించనుంది. దీని ద్వారా ప్రజలు రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు అత్యవసర వైద్య చికిత్స అందుతుంది. ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ పరిధిలో లేనివారికి కూడా ఈ ట్రీట్‌మెంట్ సౌకర్యం అందిస్తారు.
ఈ పథకం అమలు, విధివిధానాలపై ఆరోగ్యశ్రీ ట్రస్టుతో రవాణాశాఖ చర్యలు జరుపుతోంది. ఇప్పటికే పాలీట్రామా సేవలు అందించే ఆస్పత్రుల వివరాలను ఆరోగ్యశ్రీ ట్రస్టు సేకరించింది. ఈ ఆస్పత్రుల్లో కూడా క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇది అమల్లోకి వస్తే రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించవచ్చు. మరణాలను కూడా నివారించవచ్చు. అలాగే ప్రజలకు ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్పత్రి ఖర్చులు ప్రజలకు ఆదా అవుతాయి. ఈ పథకం అమలు కోసం రవాణాశాఖ, ఆరోగ్య శ్రీ ట్రస్టు, పోలీస్ శాఖ కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రంలో ప్రతీ 35 కిలోమీటర్లకు ఒక ట్రమా కేంద్రాన్ని ప్రపంబ్యాంకు నిధులతో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం ఆరోగ్యశాఖ చేస్తోంది. ఇందుకోసం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయనుందని తెలుస్తోంది.