
తెలంగాణ ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం ఇటీవల డే కేర్ సెంటర్లను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ నెల 12వ తేదీన ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వీటిని ప్రారంభించారు. వృద్దులకు వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించేందుకు ఈ సెంటర్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం కొన్నిచోట్ల మాత్రమే వీటిని స్టార్ట్ చేయగా.. త్వరలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లను ప్రవేశపెట్టనున్నారు. ఈ సెంటర్లలో వృద్దులకు వైద్యం అందించడంతో పాటు మానసిక ఉల్లాసం కోసం ఆటలు, పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఉచితంగా ఆహారం కూడా అందిస్తారు. ఈ ప్రాణం డే కేర్ సెంటర్ల ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ప్రాణం డే కేర్ సెంటర్లు ఆదివారం, ప్రభుత్వం ప్రకటించిన పబ్లిక్ హాలీడేస్‌లో మినహా మిగతా అన్ని రోజుల్లో తెరుచుకుని ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి సాయాంత్రం 6 గంటల వరకు ఓపెన్ చేసి ఉంచుటారు. ఈ సెంటర్లలో వారానికి ఒకసారి సీనియర్ సిటిజన్లకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే రోగానికి సంబంధించిన మందులను ఉచితంగా అందిస్తారు. ఇక ఇందులో లైబ్రరీ ఉంటుంది. రకరకాల పుస్తకాలు, న్యూస్ పేపర్లు ఉంటాయి. అలాగే ఇండోర్ గేమ్స్ ఉంటాయి. ప్రస్తుతానికి జిల్లాలో ఒకటి చొప్పున 39 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి,రంగారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో రెండేసి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు.
లైబ్రరీ
ఇంటర్నెట్ సౌకర్యం
కంప్యూటర్లు
మెడికల్ చెకప్, ఉచిత మందులు
ఇండోర్ గేమ్స్
రాగి జావ
రాగి సంగటి
పండ్లు
ఉప్మా
ఆరోగ్యం గురించి అవగాహన
డిజిటల్ అక్షరాస్యత గురించి కార్యక్రమాలు
ప్రభుత్వ ప్రయోజనాలు ఎలా పొందాలనే దానిపై సదస్సులు
తరాల మధ్య బంధాలపై మీటింగ్స్
తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టాలపై అవగాహణ
కేంద్ర ప్రభుత్వం ప్రతి డే కేర్ సెంటర్ కోసం సంవత్సరానికి రూ.12 లక్షలు మంజూరు చేస్తోంది. ఈ నిధులు ప్రతి సంవత్సరం విడుదల అవుతాయి. ప్రభుత్వ ఆసుపత్రులలోని జెరియాట్రిక్ వార్డులతో ఈ కేంద్రాలను అనుసంధానించనున్నారు. అలాగే సైబర్ నేరాలపై అవగాహన సెషన్లు నిర్వహించడం, బహిరంగ కార్యక్రమాలు, వృద్ధాప్య ప్రజల శ్రేయస్సు కోసం ఇతర కార్యకలాపాలను ప్లాన్ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.