
తెలంగాణలో జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ మొదలవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి రూ.12 వేలు ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి రూ.12 వేలు ఇవ్వనున్నట్లు భట్టి చెప్పారు. ఖమ్మం జిల్లా బనిగండ్లపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామంలో రూ.1.56 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన గోదాములను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. పలు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని.. ఇంకా ఏ లిస్ట్ తయారు కాలేదని.. ప్రజలు అపోహలు పడవద్దని గ్రామ సభలోనే అర్హులను ఎంపిక చేస్తారని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ఇటు మంత్రి జూపల్లి కృష్ణారావు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, లక్ష్మీకాంత్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, వెంకటరమణా రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నాలుగు పథకాలకు సంబంధించి సన్నద్ధతను కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి జూపల్లికి వివరించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు అధికారులు గ్రామస్థాయి పరిశీలన చేయాలని, రైతు భరోసాలో గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూస్తున్నామని, వ్యవసాయ యోగ్యం కాని భూములకు భరోసా ఇవ్వడం లేదని మంత్రి అన్నారు. అధికారులు జాగ్రత్తగా అర్హులను గుర్తించాలని, అర్హులకు అన్యాయం చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. రేషన్ కార్డులు అందరికీ రావడం లేదనేది అపోహ మాత్రమేనని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు మంత్రి జూపల్లి. అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని ప్రకటించారు.
ఇందిరమ్మ ఇళ్ళలో పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. రేషన్ కార్డుల్లో అనేక అభ్యంతరాలున్నాయని, వచ్చిన దరఖాస్తుల్లో 20 శాతం మాత్రమే కొత్త కార్డులు ఇస్తామని అంటున్నారని దీన్ని సవరించాలని సూచించారు.
బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కొత్తగా ప్రారంభించే ప్రభుత్వ పథకాల అమలు పై పలు సూచనలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..