Telangana Election: ఉమ్మడి జిల్లా బీజేపీలో ముసలం. అభ్యర్థులను మార్చాల్సిందే అంటున్న అసమ్మతి నేతలు
భారతీయ జనతా పార్టీలో ముసలం మొదలైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో టికెట్ల పంపకం పంచాయితీ రాజేసింది. మొన్నటి వరకు పలు నియోజకవర్గాల్లో టికెట్లను ప్రకటించడంలో అధిష్టానం అలసత్వం చేస్తుందని ఆందోళన చేసిన కార్యకర్తలే.. తాజాగా టికెట్ వచ్చిన అభ్యర్థులను మార్చాలని పట్టపటుతున్నారు. లేదంటే రాష్ట్ర కార్యాలయం ముందే నిరసన తెలుపుతామని హెచ్చరిస్తున్నారు.

భారతీయ జనతా పార్టీలో ముసలం మొదలైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో టికెట్ల పంపకం పంచాయితీ రాజేసింది. మొన్నటి వరకు పలు నియోజకవర్గాల్లో టికెట్లను ప్రకటించడంలో అధిష్టానం అలసత్వం చేస్తుందని ఆందోళన చేసిన కార్యకర్తలే.. తాజాగా టికెట్ వచ్చిన అభ్యర్థులను మార్చాలని పట్టపటుతున్నారు. లేదంటే రాష్ట్ర కార్యాలయం ముందే నిరసన తెలుపుతామని హెచ్చరిస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలకు గాను మూడు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ అధిష్టానం. దుబ్బాకలో రఘునందన్ రావు..నర్సాపూర్‌లో మురళీయాదవ్, పటాన్‌చెరులో నందీశ్వర్ గౌడ్ లను మొదటి విడత లిస్టులో ప్రకటించింది కమలం పార్టీ. అయితే ఒక్క దుబ్బాక నియోజకవర్గంలో తప్పా, మిగతా రెండు నియోజక వర్గాలు అయిన నర్సాపూర్, పటాన్ చెరు నియోజకవర్గాల్లోని అభ్యర్థులను మార్చాలని పట్టుబడుతున్నారు బీజేపీ నేతలు. దీనితో టికెట్ వచ్చిన సంతోషం కూడా లేకుండా పోతుంది ఆ నేతలకు.
ఈ వ్యవహారంతో నర్సాపూర్ బీజేపీ అభ్యర్థి మురళీ యాదవ్ పై చాలా గుర్రుగా ఉన్నారు నియోజకవర్గ బీజేపీ లోకల్ లీడర్లు. మురళీ యాదవ్ పేరును ప్రకటించినప్పటి నుండి ఇక్కడి నేతలు ఆయన పేరును వ్యతిరేకిస్తున్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మురళీ యాదవ్ బీజేపీలోకి రాగానే అతనికి పార్టీ టికెట్ ఇవ్వడంను తప్పు పడుతున్నారు సొంత పార్టీ నేతలు. నర్సాపూర్‌లో బీజేపీ పార్టీని కాపాడుతు వస్తున్న సీనియర్ లీడర్లను కాదని మురళీ యాదవ్ టికెట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని మీడియా సమావేశం పెట్టి మరీ నిలదీస్తున్నారు. మురళీయాదవ్‌కు టికెట్ రావడం వెనుక ఈటెల రాజేందర్ ఉన్నాడంటూ ధ్వజమెత్తుతున్నారు స్థానిక నేతలు. నర్సాపూర్ అభ్యర్థిని మార్చకపోతే రాష్ట్ర బీజేపీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తామంటున్నారు.
ఇక పటాన్ చెరు నియోజక వర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా నందీశ్వర్ గౌడ్ పేరును ప్రకటించింది బీజేపీ అధిష్టానం. అయితే ఇక్కడ కూడా అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు సొంత పార్టీ నేతలు. ఇక్కడ మొదటి నుండి గోదావరి అంజిరెడ్డి దంపతులు టికెట్ ఆశించారు. లోకల్ క్యాడర్ కూడా వీరికి సపోర్ట్ ఇచ్చారు. కానీ నందీశ్వర్ గౌడ్ టికెట్ రావడంతో దీన్ని ఒప్పుకోవద్దని గోదావరి అంజిరెడ్డి దంపతులపై ఒత్తిడి తెస్తున్నారు లోకల్ కేడర్. ఖచ్చితంగా దీనిపై పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. మరోవైపు ఇదే అంశంపై అధిష్టానం గోదావరి అంజిరెడ్డి దంపతులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరో నేత శ్రీకాంత్ రెడ్డి వర్గం కూడా నందీశ్వర్ గౌడ్ కి టికెట్ రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ఇదే విషయాన్ని స్వయంగా ఆయన తన అనుచరులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పాడు.
ఇలా ఉమ్మడి మెదక్ జిల్లాలో ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తేనే ఇలా ఉంది..! అసమ్మతి నేతల తీరుతో అధిష్టానం కూడా తలలు పట్టుకుని ఆలోచనలో పడిందట. అసమ్మతి నేతలు నేరుగా అధిష్టానంను టార్గెట్ చేయడం, అభ్యర్థులను మార్చకపోతే రాష్ట్ర కార్యాలయం ముందు నిరసన తెలపడం కొంత ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మొండికేస్తున్న అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు సీనియర్ నేతలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
