
కర్నాటకలో గెలుపు జోష్‌తో ఉన్న కాంగ్రెస్.. తెలంగాణలోనూ పాగా వేసేందేందుకు ఫ్లాన్ చేసింది. పక్కా వ్యూహాలతో దూకుడుగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. తెలంగాణలోని అన్ని ప్రాంతాలను చుట్టేసేందుకు అధినాయకులే రంగంలోకి దిగారు. బస్సు యాత్రని ప్రారంభించేందుకు జాతీయ స్థాయి నేతలు రాహుల్, ప్రియాంకలు రాష్ట్రానికి చేరుకున్నారు. మూడు రోజులపాటు.. 8 నియోజకవర్గాల్లో సాగే బస్సు యాత్రలో రాహుల్ పర్యటిస్తారు. యాత్రలో నిరుద్యోగులు, మహిళలు, కార్మికులు, పసుపు.. చెరుకు రైతులతో ప్రత్యేక సమావేశాలు ఉంటాయని తెలంగాణ పీసీసీ తెలిపింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యంగా కోల్ బెల్ట్ ప్రాంతంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. సింగరేణి కార్మికులతో పాటు ఇతర పరిశ్రమల కార్మికుల మద్దతును కూడగట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది పీసీసీ. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 12 నియోజకవర్గాల్లో పట్టు సాధించే అవకాశాలు ఉండడంతో హస్తం పార్టీ ఆ దిశగా అడుగులువేస్తోంది. ప్రతి కార్మికుడి దగ్గరకు చేరువయ్యేలా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. వారి బాధలు, కష్టాలు రాహుల్, ప్రియాంకలతో పంచుకునేలా ఫ్లాన్ చేసింది తెలంగాణ కాంగ్రెస్.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మెజారిటీగా ఉన్న కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు పగడ్బందీ వ్యూహరచనతో ముందుకు సాగుతోంది కాంగ్రెస్. ఈ క్రమంలోనే ములుగు నుండి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, గురువారం రామగుండం బొగ్గు గనుల ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సింగరేణి కార్మికులతో పాటు రామగుండంలో గల NTPC, RFCL, ZENCO సంస్థలకు చెందిన కాంట్రాక్టు కార్మికులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. సింగరేణి ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల కుదింపు లాంటి ఆందోళనకర విషయాలపై కార్మికుల్లో ఆత్మస్థైర్యం కల్పించేలా రాహుల్ గాంధీ భరోసా కల్పించబోతున్నారు.
ఇక RECL కుంభకోణాలతో పాటు సుదీర్ఘకాలంగా వివిధ పరిశ్రమల కాంట్రాక్టు కార్మికులు ఎదురుచూస్తున్న వేతనాల పెంపుదలపై కూడా స్పష్టమైన హామీని ఇవ్వబోతున్నారు. దీంతో, కార్మిక వర్గంలో పట్టు సాధించి రామగుండం సహా దాదాపు 12 నియోజకవర్గాల్లో కార్మికుల మద్దతును కూడగట్టుకునేలా పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతోంది కాంగ్రెస్. అయితే, ఎవరు ఎన్ని జిమ్మిక్కులకు పాల్పడినా.. మరోసారి BRS విజయం సాధించడం ఖాయమని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 60 ఏండ్లు పరిపాలించి ప్రజలను, కార్మికులను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ మాటలను ఎవరు విశ్వసించబోరని అంచనాలు వేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…