
ఏప్రిల్ నెల వస్తుందంటే సాధారణంగా ఏప్రిల్ ఫూల్ జోకులు గుర్తుకు వస్తాయి. కానీ ఈ ఏడాది తెలంగాణలోని నాన్ వెజ్ ప్రియులకు మాత్రం ఇది అస్సలు జోక్ కాదు. చికెన్ షాపుల యజమానుల అసోసియేషన్ తీసుకున్న సంచలన నిర్ణయంతో ఏప్రిల్ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ సెంటర్లు మూతపడనున్నాయి. చికెన్ షాపుల నిర్వహణ భారంగా మారిందని, తమకు వచ్చే మార్జిన్ అస్సలు సరిపోవడం లేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కిలో చికెన్‌పై రూ.30 నుండి రూ.35 వరకు లాభం మిగిలేది. కానీ ప్రస్తుతం పెరిగిన ధరల వల్ల అన్ని ఖర్చులు పోను కేవలం రూ.5 నుండి రూ.6 మాత్రమే మిగులుతోందని వారు వాపోతున్నారు. షాపుల అద్దెలు, కరెంట్ బిల్లులు, పనివారి జీతాలు, మున్సిపాలిటీ నీటి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. లాభాలన్నీ పెద్ద పౌల్ట్రీ కంపెనీలకే వెళ్తున్నాయని, రిటైల్ వ్యాపారులను ఆదుకోవడానికి మార్జిన్ పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సాధారణంగా ఒక కిలో బతికున్న కోడి ధర రూ.120 అనుకుంటే.. దానిని కట్ చేసిన తర్వాత వచ్చే మాంసం సుమారు 750 గ్రాములు మాత్రమే ఉంటుంది. దీనివల్ల కిలో చికెన్ ధర అప్పటికప్పుడే రూ.160కి చేరుతుంది. దీనిని కస్టమర్‌కు రూ. 200కి అమ్మినప్పుడు రూ. 40 లాభం కనిపిస్తుంది. కానీ ఇందులో.. షాపు రెంట్, కరెంట్ బిల్లు, కూలీల జీతాలు వేస్టేజ్, అమ్ముడుపోని స్టాక్..వంటివి తీసేస్తే తమకు మిగిలేది చాలా తక్కువ అని షాపు ఓనర్లు చెబుతున్నారు. మరోవైపు పౌల్ట్రీ కంపెనీలు తమ ఫీడ్, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పెరిగాయని చెబుతుండడ గమనార్హం.
చికెన్ షాపులు మూతపడితే దాని ప్రభావం కేవలం ఇళ్లకే పరిమితం కాదు. హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా చికెన్ ఐటమ్స్ అందించలేని పరిస్థితి ఏర్పడుతుంది. చికెన్ లేకపోతే మటన్ తిందాం అనుకునే వారికి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే కిలో మటన్ ధర సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోవడంతో ఇప్పుడు చికెన్ కూడా దొరకకపోతే నాన్ వెజ్ ప్రియుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారనుంది.
ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 8,000 నుండి 10,000 వరకు చికెన్ షాపులు ఉన్నాయి. ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు, షాపు యజమానుల మధ్య ఈ ధరల యుద్ధం త్వరగా ముగియకపోతే, మార్కెట్ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది.