
అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అమలు చేయడం లేదని ఆరోపించారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిలక ప్రచారంలో భాగంగా నిర్వహించిన బీజేపీ సంకల్ప సభలో యోగి పాల్గొన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్లు తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు బీఆర్ఎస్ సర్కార్ అన్యాయం చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ సర్కార్ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు.
కాగజ్ నగర్, వేములవాడ, గోషామహల్ ప్రచార సభల్లో సీఎం ఆదిత్యానాథ్ పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి తనకు ప్రేరణ అని, ఇక్కడికి మళ్ళీ మళ్ళీ రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కాంగ్రెస్ మద్దతుతో బీఆర్‌ఎస్ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని ఆరోపించిన యోగి, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవినీతిపరులను జైలు పంపిస్తామన్నారు. తాము ఎవరిపైనా దాడి చేయం లేదన్న యోగి.. తమపై దాడికి వస్తే విడిచిపెట్టబోమన్నారు. తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని వైభవంగానిర్వహిస్తామని యోగి ఆదిత్యానాథ్ స్పష్టం చేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో అద్భుతమైనవని కొనియాడిన యోగి, బీఆర్ఎస్ పాలనలో అమరుల త్యాగాలను పక్కనపెట్టారని విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటేనని యోగి స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థులపై అక్రమంగా కేసులు పెట్టారని, బీజేపీ ప్రభుత్వం వచ్చాక అందరికీ జవాబు చెప్తామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అయోధ్యలో రామ మందిరం నిర్మించి ఉండేదా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలకు ఉచితంగా అయోధ్య దర్శనం కల్పిస్తామని యోగి హామీ ఇచ్చారు. కరోనా సమయంలో కాంగ్రెస్ వ్యాక్సిన్ ఇచ్చేది కాదని, దేశ ప్రజలందరికీ ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ప్రధాని మోదీదని, మోడీ ఫ్రీ రేషన్ కూడా ఇస్తున్నారని గుర్తుచేశారు. మోదీ పాలనలో అందరూ సస్యశ్యామలంగా ఉన్నారని, యూపీలో డబుల్ ఇంజిన్ అద్భుతంగా ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి చెందుతుందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…