
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు భూముల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా 22-A నిషేధిత భూముల జాబితా అంశం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. 22-A కారణంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని, భూముల రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది. తాజాగా అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గణాంకాలతో బీఆర్‌ఎస్‌కు కౌంటర్ ఇచ్చారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 22-A అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందిందని, భూముల విలువలు భారీగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోందని విమర్శించారు. ఈ ఆరోపణలకు అసెంబ్లీ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాధానమిచ్చారు. 22-A కారణంగా రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ రాబడి తగ్గిపోయాయన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను వెల్లడించారు.
మంత్రి అసెంబ్లీకి తెలిపిన వివరాల ప్రకారం.. 2025 ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగస్టు ఐదు నెలల కాలంలో రాష్ట్రంలో మొత్తం 4,90,478 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయన్నారు. అదే ఐదు నెలల కాలాన్ని 2026లో పరిశీలిస్తే 5,10,273 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయినట్లు తెలిపారు. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 19,795 డాక్యుమెంట్లు అదనంగా రిజిస్టర్ అయ్యాయని మంత్రి వివరించారు.
ఇక రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని పరిశీలించినా తగ్గుదల కనిపించలేదని మంత్రి పొంగులేటి తెలిపారు. 2025లో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల్లో రూ.6,216 కోట్ల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. అదే 2026లో ఐదు నెలల కాలంలో రూ.7,575 కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. అంటే గత ఏడాదితో పోలిస్తే రూ.1,359 కోట్ల అదనపు ఆదాయం వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ గణాంకాలను ప్రస్తావిస్తూ 22-A వల్ల రిజిస్ట్రేషన్లు, ఆదాయం తగ్గిపోయాయన్న బీఆర్‌ఎస్ ఆరోపణలను మంత్రి పొంగులేటి తిప్పికొట్టారు. వాస్తవ పరిస్థితిని గణాంకాలే చెబుతున్నాయని స్పష్టం చేశారు.
మరోవైపు 22-A నిషేధిత భూముల జాబితా విషయంలో మాత్రం రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. భూముల రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, రియల్ ఎస్టేట్ రంగం, సామాన్యుల భూ హక్కులు వంటి అంశాలు ఈ వివాదంతో ముడిపడి ఉన్నాయి. దీంతో 22-A అంశం కేవలం రెవెన్యూ వ్యవహారంగా కాకుండా తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన రాజకీయ అంశంగా మారింది.
బీఆర్‌ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్ ప్రభుత్వం గణాంకాలతో సమాధానం ఇవ్వడంతో 22-Aపై ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. రిజిస్ట్రేషన్లు, రాబడి పెరిగాయన్న ప్రభుత్వ వాదనకు విపక్షం ఎలాంటి కౌంటర్ ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..