నిన్నటి వరకు కత్తులు దూసుకున్నారు..! అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్నారు. ఇప్పుడు స్నేహగీతం పాడుకుంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. అప్పటి వరకు ఎంత కొట్టుకున్నా..ఆ వెంటనే కలిసిపోతారు ఇలాంటి సీన్లు..ఒక్క రాజకీయాల్లోనే చూస్తుంటాం.. ఇక్కడా అదే జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీల మధ్య జరుగుతున్న రగడ తెలిసిందే.. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాండూర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల మధ్య ఉన్న ముసలం తెలిసిందే..
తాండూర్ లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్య తార స్థాయిలో రాజకీయాలు నడిచాయి.. చాలా సార్లు వీళ్ల పంచాయతీ అధిష్టానం వద్దకు చేరింది. గులాబీ బాస్ కూడా ఇరువురికీ ఎన్నోసార్లు సర్ది చెప్పారు. అయినా మారలేదు.. కానీ ఉన్నట్లుండి ఇద్దరూ కలిసిపోయినట్లే కనిపిస్తున్నారు. పైలెట్, పట్నంలో ఊహించని ఈ మార్పుకు కారణమేంటో కానీ..కేడర్ మాత్రం ఖుషీగానే ఉంది. ఇప్పటి వరకు ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా వ్యవహరించిన వీళ్లు.. ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలిసి చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
మరోవైపు, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వార్ నడిచింది..మీడియా ముఖంగానే ఇద్దరూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. అవినీతికి పాల్పడ్డారంటూ వ్యక్తిగతంగా దూషించుకున్నారు. ఈ మేటర్ చాలా సీరియస్ అయ్యింది. అధిష్టానం దృష్టికి వెళ్లింది. ఇంత రచ్చకెక్కిన వీళ్లు..ఉన్నట్లుండి ఒక్కటయ్యారా..ఎప్పుడు కలిశారు అని కార్యకర్తలే అనుకుంటున్నారు. ఘన్పూర్ కు రాజయ్య ,కడియం శ్రీహరి రెండు కళ్లలాంటి వాళ్లని రాజయ్యే చెప్పడంతో అందరూ షాకయ్యారు. ఏదైనా రెండు కళ్లతోనే బాగా చూడగలం అని చెప్పారు. ఉప్పు నిప్పులా ఉన్న వీళ్లలో ఇంత సడెన్ చేంజ్ ఏంటో అన్నది కేడర్‌కు కూడా అంతుచిక్కడం లేదట. మొత్తానికి కలిసిపోయారు అదే చాలన్నట్లు చెప్పుకుంటున్నారు.
అయితే..ఇదంతా కేసీఆర్ మహిమేనంటున్నారు గులాబీ శ్రేణులు. సిట్టింగులకే టిక్కెట్లని బాస్ చెప్పడంతో.. నేతల మధ్య పొరపొచ్చాలు మాయమైపోయి ఉంటాయని టాక్.. ఏదేమైనా.. కలవడమే కదా అందరికీ కావాల్సిందని మరికొందరి అభిప్రాయం.. కానీ..వీళ్లను కలిపారా..లేదంటే వీళ్లే కలిశారా అన్నది మాత్రం అర్థం కావడం లేదని..ఇంకో బ్యాచ్ థింకింగ్..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..