
యూసుఫ్‌గూడ, ఫిబ్రవరి 7: అన్నదమ్ములు మధ్య జరిగిన స్వల్ప వివాదం చిరిగి చిరిగి గాలివానగా మారింది. వారింటికి అతిథిగా వచ్చిన అల్లుడి హత్యకు దారితీసింది. అన్నదమ్ములకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన అల్లుడిని దారుణ హత్యకు గురయ్యాడు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో సోమవారం (ఫిబ్రవరి 5) చోటుచేసుకుంది. మధురానగర్ పోలీసుల వివరాల ప్రకారం…
తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన రాణి, సరోజ అక్కాచెల్లెళ్లు. సరోజ కూతురు మార్త నిజాంపేటలో ఉంటున్నారు. మార్తకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు సంగెపాగు ప్రవీణ్ మోజెస్(20) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సెల్‌ఫోన్ రిపేరు నిమిత్తం ప్రవీణ్ మోజెస్ ఈనెల 4న రాత్రి రహ్మత్‌నగర్‌కు వెళ్లాడు. అక్కడ జవహర్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వరుసకు అమ్మమ్మ అయిన రాణి ఇంటికి వచ్చాడు. అయితే రాణి పెద్ద కుమారుడు అభిలాష్ అలెక్స్, ప్రవీణ్ మోజెస్ ఈనెల 5న ఎర్రగడ్డలో సెల్‌ఫోన్ బాగు చేయించుకుని రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అభిలాష్ అలెక్స్‌కు అభిషేక్ అలెక్స్ అలియాస్ బన్నీ అనే సోదరుడు ఉన్నాడు. అభిషేక్ బూట్లు విప్పకుండా మంచంపై అలాగే నిద్రకు ఉపక్రమించాడు. గమనించిన అభిలాష్ బూట్లు విప్పి నిద్రించాలని తమ్ముడు అభిషేక్ అలెక్స్‌కు చెప్పాడు.
ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య వివాదం రాజుకుంది. ఇది గమనించిన వరుసకు అల్లుడైన ప్రవీణ్ మోజెస్ కలుగజేసుకుని మేనమామలను వారించాడు. చిన్న విషయానికి ఎందుకు కొట్లాడుతున్నారని సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర కోపోద్రోక్తుడైన అభిషేక్ అలెక్స్ క్షణికావేశంలో కత్తితో ప్రవీణ్ మోజెస్‌ను ఛాతీ ఎడమభాగంలో పొడిచాడు. దీంతో ప్రవీణ్ అపస్మారకస్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు బాధితుడిని అమీర్‌పేట్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవీణ్ మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.