
కన్నప్రేమ కరువైంది.. కన్న కొడుకుపై కసి పెంచుకున్నాడు ఓ తండ్రి. భార్య పై ఉన్న కోపాన్ని ఎనిమిదేళ్ల అమాయకపు బాలుడిపై చూపించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన రేవర్తి కిషన్ కి, అతని భార్యకు మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే భార్య తనపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిందన్న కోపంతో కిషన్ ఇంట్లో తీవ్రంగా గొడవకు దిగాడు.
అయితే భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడుతున్న సమయంలో.. అక్కడే ఉన్న ఎనిమిదేళ్ల కొడుకు రుత్విక్ ఆ గొడవను చూసి నవ్వాడు. దీంతో కిషన్‌కు కోపం నషాళానికి అంటింది. తనను చూసి కొడుకు నవ్వుతాడా అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే ఇంట్లో కాగుతున్న వేడి నీళ్లను తెచ్చి ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా కొడుకు రుత్విక్‌పై పోశాడు. వేడి నీళ్లు శరీరంపై పడటంతో ఆ బాలుడు విలవిలలాడిపోయాడు.
దీన్ని గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలైన రుత్విక్‌ను వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. బాలుడి పరిస్థితి పై బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.. నిందితుడు రేవర్తి కిషన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కన్న కొడుకు పైనే ఇంతటి అమానుషానికి ఒడిగట్టిన తండ్రిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.