Deer Hunter: కృష్ణ జింకల వేట కేసులో వెలుగు చూస్తున్న సంచలన విషయాలు.. వ్యవసాయం ముసుగులో..

|

Mar 10, 2021 | 3:24 PM

Deer Hunter: కృష్ణ జింకల కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్‌కు జింకలను తరలిస్తూ పట్టుబడిన జింకల శంకర్.. కవ్వాల్...

Deer Hunter: కృష్ణ జింకల వేట కేసులో వెలుగు చూస్తున్న సంచలన విషయాలు.. వ్యవసాయం ముసుగులో..
Follow us on

Deer Hunter: కృష్ణ జింకల కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్‌కు జింకలను తరలిస్తూ పట్టుబడిన జింకల శంకర్.. కవ్వాల్ ఫారెస్ట్ కేంద్రంగా కృష్ణ జింకల వేట కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్మల్ నుంచి హైదరాబాద్‌కు కృష్ణ మాంసాన్ని, సజీవంగా ఉన్న మరో జింకను తీసుకువస్తూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. సంచలన విషయాలు వెలుగు చూశాయి. నిందితులను బుధవారం నాడు మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసు ఉన్నతాధికారులు.. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు. కృష్ణ జింకల కేసులో ప్రధాన సూత్రధారి చవాన్ శంకర్ బాబా, అలియాస్ జింకల శంకర్ అని తేల్చారు.

నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి చెందిన శంకర్ బాబా వ్యవసాయం చేస్తుండేవాడు. అతని వ్యవసాయ భూమి అటవీ ప్రాంతంలో ఉండటంతో కృష్ణ జింకల వేట సాగించేవాడు. అందుకోసం తన పొలాల్లో ప్రత్యేకంగా వలలు ఏర్పాటు చేసేవాడు. అలా వలలో చిక్కిన జింకలను చంపి వాటి మాంసాన్ని హైదరాబాద్‌, నిజామాబాద్‌, నిర్మల్, బోధన్‌లలో విక్రయించేవాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్ జుబేర్ జింక మాంసం క్రయవిక్రయాల్లో మధ్యవర్తిగా వ్యవహరించేవాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కవ్వాల్‌లో జింకల హంటింగ్ కోసం శంకర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా షూటర్లను కూడా రప్పించేవాడని పోలీసులు గుర్తించారు. ఇందుకోసం మహ్మద్ జుబేర్ ద్వారా షూటర్లతో రాయబారాలు సాగించేవాడని నిర్ధారించారు.

ఇదిలాఉంటే.. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన సల్మానుద్దీన్.. తన స్నేహితులకు జింక మాంసం కావాలంటూ జుబేర్‌ను సంప్రదించాడు. జుబేర్ ఈ విషయాన్ని శంకర్ బాబాకు తెలిపాడు. వెంటనే రంగంలోకి దిగిన శంకర్.. తన వ్యవసాయ క్షేత్రంలో వలలు ఏర్పాటు చేశారు. తాజాగా వలలో కృష్ణ జింకలు పడటంతో విషయాన్ని జుబేర్‌కు చేరవేశాడు. జుబేర్.. సల్మానుద్దీన్‌కు తెలిపాడు. దాంతో సల్మానుద్దీన్ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కారులో నిర్మల్ వెళ్లి శంకర్‌కు కొంత మొత్తం సొమ్ము ఇచ్చి బ్రతికున్న జింక ఒకటి, మరొక జింక మాంసాన్ని తీసుకున్నారు. మధ్యలో బోధన్‌కు చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తికి వీరు కొంత జింక మాంసాన్ని విక్రయించారు. అనంతరం బతికున్న జింక సహా, మరో జింక మాంసాన్ని తీసుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. అప్పటికే విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా.. ఆసిఫ్‌నగర్‌లో కాపుకాసి పట్టుకున్నారు. కారులో ఉన్న సల్మానుద్దీన్ సహా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారించగా.. కీలక విషయాలు వెలుగు చూశాయి.

Hyderabad Police Tweet:

కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. చవాన్ శంకర్ బాబా, మహ్మద్ జుబేర్‌, మహ్మద్ సల్మానుద్దీన్, ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, శంకర్ బాబాపై గతంలోనూ జింకలను వేటాడిన కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక శంకర్‌తో కాంటాక్ట్‌లో ఉన్న షూటర్ల సమాచారాన్ని సేకరిస్తున్న పోలీసులు.. గత కొంతకాలంగా హైదరాబాద్‌ నుంచి హంటింగ్ కోసం వెళ్లిన షూటర్ల కోసం ఆరా తీస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లో జింక మాంసంతో పార్టీ చేసుకోవాలని చూసిన బాడీ బిల్డర్‌ల సమాచారాన్ని కూడా పోలీసులు సేకరిస్తున్నారు.

Also read:

Allari Naresh Naandhi : అల్లరి నరేష్ నట విశ్వరూపం నాంది.. త్వరలో డిజిటల్ లో ప్రసారం..

AP Municipal Elections 2021 : పోలీసులు వారించినా క్యూలో నిల్చునే ఓటుహక్కు వినియోగించుకున్న అఖిలప్రియ, పోలీసు అధికారిని తోసేసిన కొల్లు