Sathupally MLA Sandra Venkata Veeraiah: ధాన్యం సేకరణకు దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) డిమాండ్ చేస్తోంది. దీనిలో భాగంగా సీఎం కేసీఆర్ సహా మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పెద్ద ఎత్తున దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ దీక్షలో బీకేయూ నేత రాకేష్ టికాయత్ సైతం పాల్గొన్నారు. ముందు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్.. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి దీక్షకు కూర్చున్నారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడటంలో కేంద్రం విఫలమయిందని.. కేంద్రం తీరుకు నిరసనగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళనలు నిర్వహించేందుకు కేసీఆర్ (CM KCR) ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించిన టీఆర్ఎస్.. ఢిల్లీలో నిరసన తెలుపుతోంది. కాగా.. ఢిల్లీ టీఆర్ఎస్ దీక్షలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సండ్ర నలుపు రంగు వస్త్రాలు ధరించి వరి కంకులతో సభా స్థలికి చేరుకున్నారు. ఆకుపచ్చ రంగు తలపాగ ధరించి కావడితో భవన్‌కు చేరుకున్నారు. కావడికి ముందు మోదీ ఫోటోను, వెనుకాల వరి కంకులను ఉంచి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నిరసన వ్యక్తంచేశారు. ఈ దీక్షలో మరికొంత మంది నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నలుపు రంగు వస్త్రాలు దీక్షకు హాజరయ్యారు. ఈ దీక్షకు భారీ సంఖ్యలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు.
కాగా.. సభాస్థలికి కొంతమంది వరితో చేసిన గొడుగులతో వచ్చారు. వడ్ల మూటలు నెత్తిన పెట్టుకుని కొందరు.. ఒంటిపై కేసీఆర్, కేటీఆర్ బొమ్మలతో మరికొంతమంది సభా ప్రాంగణానికి వచ్చారు. అంతేకాకుండా సింగరేణి కార్మికుల స్టైల్‌లో తలకు హెడ్ లైట్లు పెట్టుకుని.. చేతులో ప్లకార్డులు పట్టుకుని కూడా టీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Also Read: