
తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. పదో విడత రైతుబంధు నిధులను విడుదల చేసింది. యాసంగి పంట కోసం తొలి రోజున 21 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రూ. 607.32 కోట్లు జమ చేసింది. తొలుత ఎకరం వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రూ. 5 వేలు చొప్పున జమ చేసింది. రేపు రెండు, ఎల్లుండి మూడు ఎకరాలలోపు ఉన్న రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయనుంది. ఇలా రోజు ఎకరా విస్తీర్ణం పెంచుతూ జనవరి 15వ తేదీలోగా 70.54 లక్షల మంది రైతులకు నగదు డిపాజిట్ చేయనుంది. మొత్తం 1.53 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందనుంది.
కాగా, రైతులకు అండగా నిలుస్తూ తెలంగాణ సర్కార్ ప్రతీ ఏటా రైతుబంధు పధకం కింద ఎకరానికి రూ. 10 వేల సాయాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పధకాన్ని సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తాను సీఎంగా ఉన్నంతకాలం రైతుబంధు పధకం ఆగదని ఆయన గతంలో పలుమార్లు చెప్పిన సందర్భాలు లేకపోలేదు. ఇప్పటివరకు రైతుబంధు పధకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది విడతలగా రైతులకు సాయాన్ని అందించింది.