Telangana: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరిగిన బియ్యం ధరలు.. ఎంతంటే..?

తెలంగాణలో సామాన్యులకు షాకింగ్ న్యూస్. బియ్యం ధరలు పెరుగుతున్నాయి. ఎల్‌నివో ప్రభావంతో పంట దిగుబడి తగ్గిపోతుందనే ఆందోళనలు రేకెత్తుతున్నాయి. దీని వల్ల వ్యాపారులు బియ్యాన్ని నిల్వ చేసుకుంటున్నారు. ఈ కారణంతో ధరలు పెరుగుతున్నాయి. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగాయి.

Telangana: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరిగిన బియ్యం ధరలు.. ఎంతంటే..?
Rice

Edited By:

Updated on: Jul 29, 2026 | 4:19 PM

తెలంగాణలో బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో ధరల పెరుగుదల మరింత ఎక్కువగా నమోదవుతోంది. ఈ పరిస్థితికి ఎల్‌నినో ప్రభావంతో పంట దిగుబడులపై నెలకొన్న ఆందోళనలు ఒక కారణమైతే,.. ప్రైవేటు వ్యాపారులు భారీగా బియ్యాన్ని నిల్వ చేయడం మరో ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. మే నుంచి జులై మధ్య దేశవ్యాప్తంగా బియ్యం రిటైల్ ధరలు సగటున 3.33 శాతం పెరిగాయి. అదే కాలంలో తెలంగాణలో మాత్రం 4.65 శాతం పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో బియ్యం సగటు రిటైల్ ధర కిలోకు రూ.52.67గా ఉండగా.. ఇది దేశ సగటుతో పోలిస్తే దాదాపు రూ.10 ఎక్కువ. ప్రముఖ రకాల సన్నబియ్యం ధరలు కిలోకు రూ.54 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు.. ఎల్‌నినో ప్రభావంతో పంటపై ఆందోళనలు నెలకొనడంతో ధరలు పెరిగాయని చెప్పారు. రానున్న నెలల్లో పంట బాగా వస్తే ధరలు మళ్లీ తగ్గే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

అయితే ధరల పెరుగుదలకు ఎల్‌నినో ఒక్కటే కారణం కాదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం బాగానే ఉన్నందున సరఫరాలో పెద్ద అంతరాయం లేదన్నారు. అయినప్పటికీ ధరలు పెరగడానికి ప్రైవేటు వ్యాపారుల నిల్వలు కూడా ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పొందించిన పాలసీ పత్రం ప్రకారం.. భౌగోళిక-రాజకీయ అనిశ్చితులు, ఎరువులు-ఇంధన వ్యయాల పెరుగుదల, ఆసియా దేశాల్లో ఎల్‌నినో ప్రభావం కారణంగా ప్రపంచ మార్కెట్‌లో బియ్యం ధరలు 30 నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

పాలసీ పత్రంలో మూడు రకాల పరిస్థితులను ప్రస్తావించారు. పంట ఉత్పత్తి సాధారణంగా ఉండి, భారీ కొనుగోళ్లు జరగకపోతే ధరలు 10-20 శాతం వరకు మాత్రమే పెరగొచ్చని పేర్కొంది. అయితే ప్రస్తుతం ఎక్కువ అవకాశాలు ఉన్న పరిస్థితిలో.. మోస్తరు దిగుబడి తగ్గుదల, నిల్వల పెరుగుదల కారణంగా ధరలు 30-50 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఒకవేళ ఎగుమతి ఆంక్షలు, భయంతో భారీ కొనుగోళ్లు జరిగితే ప్రపంచ బియ్యం ధరలు రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రానున్న ఖరీఫ్ పంట ఆశించిన స్థాయిలో వస్తే బియ్యం ధరలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. అయితే ఎల్‌నినో ప్రభావం కొనసాగడం, నిల్వలు పెరగడం వంటి అంశాలు కొనసాగితే వినియోగదారులపై ధరల భారం మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us