ఎర్ర బంగారం రోజురోజుకూ ఘాటెక్కుతోంది. క్వింటాల్ తేజ రకానికి 23 వేల రూపాయలు ధర పలకవడంతో మిర్చి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం ఘాటెక్కింది. ఇప్పటికే దేశీ, సింగల్ పట్టి రకాలు బంగారాన్ని మించిపోయాయి. క్వింటాల్ డిసి మిర్చి 72వేలు పలకగా, సింగిల్ పట్టి 63వేలు పలికింది. ఇవే కాకుండా వండర్ హార్ట్ 38 వేల 200, దీపిక రకానికి 32 వేల 800, 341 మిర్చి రకానికి 23 వేల 600 ధర పలికింది. ఇక తేజ రకానికి ఈ యేడాది ఆల్‌టైం రికార్డ్ ధర 23 వేల రూపాయలు పలకడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కి అన్ని రకాల మిర్చికి మంచి ధర పలుకుతోందని మార్కెట్ సెక్రటరీ రాహుల్ తెలిపారు. మార్కెట్‌లో హై రేట్ నమోదైన రైతులను సన్మానించామని ఆయన తెలిపారు. రైతులు లేనిది మార్కెట్ లేదని, వారు పండించిన పంటకు మంచి ధర పలికినప్పుడే ఆ రైతు సంతోషంగా ఉంటారన్నారు. ప్రస్తుతం ఏనుమాముల మార్కెట్లో మిర్చి ధరలు రైతుకు ఆశ జనకంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మొత్తానికి ఏనుమాముల మిర్చి మార్కెట్‌లో గతంలో ఎన్నడూలేని విధంగా ధర పలకడంతో అన్నదాతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..