Telangana Weather: ఎండల నుంచి బిగ్ రిలీఫ్.. రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు

మండుతున్న ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏప్రిల్​ 1 తేదీ నుంచి మూడో తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది.

Telangana Weather: ఎండల నుంచి బిగ్ రిలీఫ్.. రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు
Weather Report

Edited By: Ram Naramaneni

Updated on: Mar 31, 2025 | 5:08 PM

ఇన్ని రోజులు ఎండలు, వడగాలులతో అల్లాడిపోయిన తెలంగాణ ప్రజలకు చల్లని వార్త ఇది.  తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి.
ద్రోణి, మరో వైపు ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మరత్వాడ దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఆవర్తనం ఏర్పడింది. దానితో పాటు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి విదర్భ, మరత్వాడ సమీప ప్రాంతంలోని ఆవర్తనం మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతున్నది. వీటి ప్రభావంతో రాగల రెండు రోజులలో తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

ఆదివారం వరకు కూడా తెలంగాణలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే నాలుగు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుండి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. ఆ తరువాత గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

మంగళవారం తెలంగాణలోని నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు వడగండ్లతో కూడిన వర్షాలు ఉన్న కారణంగా మొక్కజొన్న తదితర పంటలు వేసిన రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి