PM Modi: హైదరాబాద్‌లో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన.. టూర్‌ టాప్ హైలెట్స్ ఇవే..

|

May 26, 2022 | 4:39 PM

8 Years of Modi Government: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన ముగిసింది. ఐఎస్‌బిలో జరిగిన 20వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు మోదీ. జీ 20 దేశాల్లో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.

PM Modi: హైదరాబాద్‌లో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన.. టూర్‌ టాప్ హైలెట్స్ ఇవే..
Pm Modi Hyd Vist
Follow us on

PM Modi’s Hyderabad Visit: రాష్ట్ర పాలనపై ఆరోపణలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi). కుటుంబ పాలనలో అవినీతి పెరిగిందన్నారు. అమరవీరుల త్యాగాలతో ఒక్క కుటుంబమే బాగుపడిందన్నారు మోదీ. టీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా విమర్శలు సంధించారు ప్రధాని మోదీ. అయితే.. తెలుగులో తెలంగాణ ప్రజలకు నమస్కారాలంటూ ప్రసంగం మొదలు పెట్టిన ప్రధాని మోదీ.. మొదట తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ.. తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. తానెప్పుడు రాష్ట్రానికి వచ్చినా అపూర్వ స్వాగతం పలుకుతున్నారని.. వేర్వేరు ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలతో తెలంగాణలో మార్పు తథ్యమని స్పష్టం చేస్తోందన్నారు ప్రధాని మోదీ. పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజలు మరోపేరని.. తెలంగాణ ఎప్పుడొచ్చినా మీరు రుణం పెరిగిపోతుందని.. మీ ప్రేమాభిమానాలే బలం అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కుటుంబపాలనతో తెలంగాణను బందీ చేయాలని చూస్తున్నారని .. బీజేపీ మాత్రం 21వ శతాబ్దపు ఆలోచనలతో ముందుకు తీసుకెళ్తుందన్నారు ప్రధాని మోదీ. ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ త్యాగం చేశారని మోడీ పేర్కొన్నారు. తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. బీజేపీ కార్యకర్తలు, నేతలు సర్దార్ పేటల్ స్ఫూర్తితో ఉద్యమించాలని, ఆయన్ను అనుసరించాలని సూచించారు. కుటుంబ పార్టీలు రాజకీయాలకే కాదు.. ప్రజాస్వామ్యానికి శత్రువులన్నారు ప్రధాని మోదీ. కుటుంబ పార్టీలకు పేదల బాధలు, సమస్యలు పట్టవన్నారు. తెలంగాణలో కేంద్ర పథకాల పేరు మార్చి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు ప్రధాని మోదీ.

బేగంపేటలో బీజేపీ నేతలతో సమావేశం తర్వాత ప్రధాని మోదీ.. రోడ్డు మార్గంలో ఐఎస్‌బీకి చేరుకుని వార్షికోత్సవంలో పాల్గొన్నారు. పది మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్‌తోపాటు పట్టాలు అందించారు. ఆ తర్వాత అకాడెమిక్‌ సెంటర్‌లో ప్రధాని మొక్కను నాటారు. ISB స్నాతకోత్సవంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. యువత తమ లక్ష్యాలతోపాటు దేశ ఉన్నతికి శ్రమించాలని పిలుపునిచ్చారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ISB) హైదరాబాద్‌ మరో మైలురాయిని అందుకుందని.. దేశానికే గర్వకారణంగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. ఐఎస్‌బీ నుంచి ఇప్పటివరకు 50 వేల మంది బయటకు వెళ్లారని.. ఇక్కడి విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు అనేక స్టార్టప్‌లు రూపొందించారని తెలిపారు. ఐఎస్‌బీ విద్యార్థులు దేశానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. 25 ఏళ్ల నాటి సంకల్పంలో ఇక్కడ చదివిన ప్రతి ఒక్కరి ముఖ్య పాత్ర ఉందని మోదీ అన్నారు.

ఈ సందర్భంగా ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ చిహ్నాన్ని మోదీ ఆవిష్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐఎస్‌బీ స్కాలర్లకు ఎక్సలెన్స్‌, లీడర్‌షిప్‌ అవార్డులు ప్రదానం చేశారు. ఐఎస్‌బీ స్కాలర్లు అభిజిత్‌, భరద్వాజ్‌, వైదేహీ, విక్రమ్‌సింగ్‌, ఉత్కర్ష్‌, ప్రదీప్‌లు మోదీ చేతుల మీదుగా బంగారు పతకాలు అందుకున్నారు. రాఘవ్‌ చోప్రాకు హైదరాబాద్‌ క్యాంపస్‌ ఛైర్‌పర్సన్‌ అవార్డును ప్రధాని మోదీ అందించారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఐఎస్‌బీ వార్షికోత్సవంలో పాల్గొన్నారు.

జీ 20 దేశాల్లో భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా ఉందని అన్నారు ప్రధాని. స్మార్ట్‌ఫోన్‌ డేటా వినియోగదారుల జాబితాలో దేశం అగ్రస్థానంలో ఉందన్నారు. అంతర్జాల వినియోగదారుల జాబితాలో భారత్‌ రెండో స్థానంలో ఉందని వెల్లడించారు. స్టార్టప్స్‌ రూపకల్పన, వినియోగదారుల మార్కెట్‌లో భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోందని కొనియాడారు. అయితే కరోనా విపత్తు వేళ భారత్‌ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందని గుర్తు చేశారు. కొవిడ్‌ కారణంగా వ్యవస్థలోని గొలుసు సరఫరా పద్ధతి పూర్తిగా దెబ్బతిందని.. అయితే విపత్కర పరిస్థితుల్లోనూ అభివృద్ధిలో భారత్‌ పురోభివృద్ధి సాధిస్తోందని అభిప్రాయపడ్డారు.

గత ఏడాది భారత్‌కు రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయన్నారు. వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఈ ఘనతలన్నీ ప్రభుత్వ ప్రయత్నాల వల్ల మాత్రమే సాధ్యం కాలేదని.. భారత్‌ సాధించిన ఘనతలో ఐఎస్‌బీ విద్యార్థులు, యువకుల పాత్ర ఎంతో ఉందన్నారు. అనంతరం ఐఎస్‌బీ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని.. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు తిరుగు పయనమయ్యారు. అక్కడి నుంచి చెన్నై బయలుదేరి వెళ్లారు.