Telangana: ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు

| Edited By: Ram Naramaneni

Nov 21, 2024 | 12:20 PM

ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే భక్తులు రంగు మారిపోతున్నారు. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.. ఇది హనుమంతుడి మహిమ అని భక్తులు అంటుంటే.. పురావస్తుశాఖ అధికారులు మరో రీజన్ చెబుతున్నారు. ఆ డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం....

Telangana: ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
People Turn Yellow
Follow us on

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామ శివారు ప్రాంతంలో గుంటపల్లి చెరువు సమీపాన మూడు కిలోమీటర్ల దూరంలో రాసిగుట్ట ఉంది. ఇక్కడ మహిమాన్వితమైన ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలోగల ఎత్తైన రాశిగుట్ట ఎక్కిన వారు పసుపు పచ్చ రంగులో మారుతున్నారు. అడవిలో ఎత్తయిన చెట్లు, బండరాళ్లు, కప్పి ఉన్న పొడవైన కొండల మధ్యలో రాశిగుట్ట ఉంది. వర్షాకాలంలో కొండపై పారే నాలుగు జలపాతాలు ప్రత్యేక ఆకర్షణగా కనులవిందు చేస్తాయి.

ఈ కొండపైనే వెలసిన ఆంజనేయస్వామి ఆలయంలో మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు వెళ్తున్న సమయంలో అనేక వింతలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రాశిగుట్ట ఎక్కిన వారు పసుపు రంగులోకి మారిపోతారు. ఇది దేవుని మహిమ అని భక్తులు అంటారు.
దట్టమైన అడవి గుండా కాలినడకన ప్రయాణిస్తే సుమారుగా గంట వరకు గుట్టపైకి చేరుకుంటారు.. ఈ గుట్టపైనే వెలిసిన ఆంజనేయస్వామి ఆలయం ఇటీవల ప్రాచుర్యాన్ని తన సొంతం చేసుకుంది. అంజన్న సన్నిదానంలో అంతా పసుపుమయంగానే కనిపిస్తోంది. ఇక్కడ వెలసిన ఆంజనేయ స్వామి వారిని దాసాంజనేయ స్వామి అని కొలుస్తుంటారు. ఈ రాశి గుట్టపైకి స్వామివారిని దర్శించుకోవాలంటే మూడు కిలోమీటర్ల మేరకు ఉన్న రాసి గుట్టను సాహసోపేతంగా ఎక్కి స్వామివారిని దర్శించుకునే సమయానికి వ్యక్తి శరీరం (కాళ్ళు, చేతులు) పసుపు రంగులోకి మారిపోతాయి. ఇలా నిత్యం జరుగుతుందని స్థానిక ప్రజలతో పాటు దర్శించుకున్న భక్తులు చెబుతున్నారు. సైన్స్‌కు సైతం అంతుచిక్కని రహస్యాలు రాసి గుట్టపై ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. రాసి గుట్టపై ఉండే రాళ్లు తేలికపాటిగా ఉండి చిన్నపిల్లలు రాసుకోవడానికి, తినడానికి వాటిని ఉపయోగించడం విశేషం. వాటిని రాశి గుట్ట బలపాలు అంటారు. కాలితో తాకితే గరుకుగాను, గట్టిగానూ రాయి వలే ఉంటాయి. కానీ నోటిలో వేసుకుంటే మాత్రం మెత్తగా తీయని రుచి వస్తుంది.

కొండ ఎక్కే మార్గంలో…

మట్టి, చిన్నచిన్న రాళ్లు, లెటరైట్ చిన్నచిన్న ఖనిజపు రేనువుల మధ్య ఖాళీలు ఏర్పడి నేల వదులుగా మారడంతో గుట్ట ఎక్కడం కష్టంగా ఉంటుంది. దట్టమైన అడవిలో గుట్టలను దాటుతూ రాళ్ల మధ్య నుంచే కాలినడకన గుట్టపైకి చేరుకోవాల్సి ఉంటుంది. చెప్పులతో ఎక్కినప్పుడు నిటారుగా, వదులుగా ఉన్న మట్టిపై జారి పడిపోతారు. రాశిగుట్ట ఎక్కే భక్తులు తప్పనిసరిగా చెప్పులు విడిచే గట్టపైకి ఎక్కాలని ఇక్కడికి వచ్చిన భక్తులు అంటారు.

రాశిగుట్టపై భాగానికి ఎక్కుతున్న క్రమంలో పసుపు రంగు ఉన్న దూళి గాలిలోకి లేస్తుంది. ఇదే పసుపు రంగు దూలి(దుమ్ము) పాదాలు, చేతులపైకి చేరడంతో పసుపు రంగులో కనిపిస్తాయి. ఈ క్రమంలోనే గుట్ట ఎక్కుతున్న భక్తులు కూడా పసుపురంగుగా మారిపోతున్నారు. దీంతో గుట్టపైకి చేరుకోగానే శరీర రంగులు మారుతాయని స్థానికులు నమ్ముతారు. ఒక్కసారి రాశిగుట్ట ఎక్కి వచ్చిన భక్తులకు కోరిన కోరికలు నేరవేరుతాయనేది భక్తుల ఆపారనమ్మకం. చేతులు, కాళ్లు పసుపు రంగులోకి మారడం భక్తులకు అంతు చిక్కడం లేదు. భక్తులు మాత్రం అంతా స్వామి మహిమగా భావిస్తారు. ఏదీ ఏమైన అంతా ప్రాచుర్యంలో లేని ఈ ఆలయం కేవలం పసుపు మయంతోనే ఇటీవల వెలుగులోకి వచ్చింది.
ఇంతటి చరిత్ర ఉన్న రాశిగుట్ట ప్రాంతానికి పశువుల కాపరులు వెళ్లడానికి కూడా జంకుతారు. పూర్తిగా అడవి విస్తరించి చిరుత పులులు, ఎలుగుబండ్లు సంచరించే ఈ ప్రాంతంలో గుట్టపై వెలసిన స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఒంటిరిగా కాకుండా ఎక్కువ మంది బృందంతో కలిసి వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. అలాంటి రాశిగుట్ట నేడు రాష్ట్ర వ్యాప్తంగా భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది.

శ్రావణమాసం హనుమాన్ జయంతి సమయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. చుట్టూ గుట్టల సమూహం.. మధ్యలో రాశి గుట్ట ఉంటుంది. పచ్చని అటవీ ప్రాంతం ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. ఈ మూడు కిలోమీటర్ల మేర ఎలాంటి వాహనాలు రావడానికి సౌకర్యం లేదు. దీంతో దాదాపు మూడు కిలోమీటర్లు కాలినడకనే వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు భక్తులు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు 39 కిలోమీటర్ల దూరంలో ఈ రాసి గుట్ట ఉంది.

Temple

పురావస్తుశాఖ అధికారుల పరిశోధనలు…

రాశిగుట్టపై ఉన్న ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులు పసుపు రంగులోకి మారుతున్నట్లు తెలుసుకున్న పురావస్తుశాఖ అధికారుల బృందం ఇటీవల రాశిగుట్టను సందర్శించారు. రాశిగుట్ట రహస్యంపై వారు అనేక విషయాలను వెల్లడించారు. గుట్టపై భాగాన లెటరైట్ శిలలు ఉన్నాయని, దీనినే లెటరైట్ క్యాపింగ్ అంటారని అన్నారు. అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షాపాతం ఉన్న ప్రాంతాల్లో ఇవి ఏర్పాడతాయని పేర్కొంటున్నారు. ఈ శిలలు గాలి, నీరు, వాతావరణానికి ఆక్సీకరణం చెంది గుల్లలు గుల్లలుగా స్పాంజివలే తయారవుతాయని. జాజు, పసుపు రంగు లేదా.. నారింజ రంగను సంతరించుకుని గుట్ట ఎక్కుతున్న క్రమంలో రంగు మారి అది పసుపు రంగుగా మారుతుందని వారు పేర్కొంటున్నారు.

జానపద కథల ప్రకారం:

హనుమంతుడు సంజీవని పర్వతం మోసుకెళ్తున్న క్రమంలో ఓ చిన్న ముక్క జారిపడి కొండగట్టుగా వెలిసిందని.. అదే క్రమంలో ఈ ప్రాంతంలో కూడా ఓ చిన్న ముక్క పడి రాసి గుట్టగా వెలిసిందని ఈ ప్రాంత వాసుల ప్రతీతి. ఈ గుట్టపై రాళ్లు జాదు రంగులో ఉంటాయి. ఎంతో శక్తివంతమైన హనుమంతుని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. సౌకర్యాలు లేమితో కొద్ది సమస్యగా మారిందని భక్తులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తే గొప్ప పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందుతుందని భక్తులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శని, మంగళవారాల్లో సందర్శకులు భక్తుల తాకిడి ఈ ఆలయానికి ఎక్కువ ఉంటుంది. కోరిన కోర్కెలు తీర్చే దయామయుడు దాసాంజనేయ స్వామి అని భక్తులు పిలుస్తారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..