
పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిద్దపల్లి గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో చెక్కర్లు కొడుతోంది. గ్రామంలో అనుమానాస్పదంగా పూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సింగరేణి ప్రభావిత గ్రామం కావడంతో ప్రస్తుతం జనసంచారం లేక, అక్కడక్కడా కొన్ని ఇళ్లు మాత్రమే ఉండటంతో ఈ ఘటనపై మరింత చర్చకు దారితీసింది. ఆదివారం అర్ధరాత్రి గ్రామంలోని ప్రధాన రహదారిపై నిర్మానుష్య ప్రదేశంలో అనుమానాస్పద పూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించడంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
అర్థరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు గ్రామంలో పూజలు నిర్వహించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూజలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిర్మానుష్యంగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఏదో ఒక బొమ్మను చేసి.. చుట్టూ పసుపు కుంకుమ వేసి.. తర్వాత ఈ బొమ్మను దహనం చేశారు. ఆదివారం కావడంతో.. ఏదో ఒక పూజ కోసం ఇలాంటి పూజలు చేశారని స్థానికులు బలంగా నమ్ముతున్నారు.
అయితే అక్కడ నిజంగా ఏం జరిగింది? పూజలు ఎవరు నిర్వహించారు? ఏదైనా ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు, పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. సిద్దపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడితేనే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మూఢ నమ్మకాలు.. శాస్త్రీయ ఆధారాలు లేనివి.. క్షుద్రపూజలు లాంటివి భయాల మీద ఆధారపడిన తప్పుడు భావాలు. వీటిని నమ్మడం వల్ల సమాజంలో నష్టం జరుగుతుంది. సైన్స్, ఆలోచనతో ప్రతి విషయాన్ని పరిశీలించడం మంచిది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..