ఆమెకు పెళ్లైంది.. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాత ప్రియుడితో మళ్లీ స్నేహం.. ఆ తర్వాత

పెద్దపల్లి జిల్లాలో టెన్త్ క్లాస్ ప్రేమకథ చివరకు దారుణ హత్యకు దారి తీసింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో మళ్లీ దగ్గరైన మాజీ ప్రేమికుడిని.. మహిళ తన భర్త, స్నేహితుడితో కలిసి హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. మిస్సింగ్ కేసు దర్యాప్తులో గాడుదుల గండి లోయలో మృతదేహం బయటపడగా.. సెల్‌ఫోన్ ఆధారాలతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆమెకు పెళ్లైంది.. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాత ప్రియుడితో మళ్లీ స్నేహం.. ఆ తర్వాత
Vamsi

Edited By:

Updated on: May 12, 2026 | 11:54 AM

ప్రేమ గుడ్డిదే కాదు.. కొన్ని సందర్భాల్లో ప్రాణాల్ని తీసేంత పిచ్చిగా మారుతుంది. తెలిసీ తెలియని వయసులో మొదలైన ఓ ప్రేమకథ.. చివరకు దారుణ హత్యకు దారి తీసింది. విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. ఓ క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే విషాద ఘటనగా మారింది. సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతాన్ని కలచివేసిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పుడు సంచలనంగా మారింది.

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన అలేఖ్య, జూలా వంశీ పదో తరగతి చదివే రోజుల నుంచే ప్రేమించుకున్నారు. అయితే కొంతకాలానికి అలేఖ్య జీవితంలో నవీన్ అనే యువకుడు రావడంతో పరిస్థితులు మారిపోయాయి. జూలా వంశీని దూరం చేసి నవీన్‌ను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది అలేఖ్య. ఇంతవరకు సాధారణంగానే సాగిన ఈ కథ.. ఇటీవల జరిగిన టెన్త్ క్లాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో మళ్లీ మలుపు తిరిగింది. ఎన్నాళ్లకో కలిసిన అలేఖ్య, వంశీ మధ్య పాత జ్ఞాపకాలు మళ్లీ చిగురించాయి. మాటలు మొదలయ్యాయి. పరిచయం మళ్లీ దగ్గరైంది. ఈ విషయాన్ని గమనించిన భర్త నవీన్.. భార్యను నిలదీయడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి.

ఈ క్రమంలోనే గత నెల గ్రామదేవతల ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అలేఖ్య-నవీన్ దంపతులు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చారు. అప్పుడే జూలా వంశీని హత్య చేయాలని కుట్ర పన్నారు. ఏప్రిల్ 30న వంశీని హైదరాబాద్‌కు రప్పించిన నవీన్.. తన స్నేహితుడు భాస్కర్ సహాయంతో అతనికి అధికంగా మద్యం తాగించారు. మత్తులో ఉన్న వంశీపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కవర్లో చుట్టి కార్ డిక్కీలో వేసుకుని మంథని సమీపంలోని గాడుదుల గండి లోయలో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇక వంశీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గోదావరిఖని టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఈ నెల 10న గాడుదుల గండి లోయలో కుళ్లిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబ సభ్యుల ద్వారా అది జూలా వంశీ మృతదేహమని నిర్ధారించారు. సెల్‌ఫోన్ ఆధారాలు, కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి.. అలేఖ్య, ఆమె భర్త నవీన్, సహకరించిన భాస్కర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఒకప్పుడు స్కూల్ ప్రేమగా మొదలైన బంధం.. చివరకు రక్తపాతం, కటకటాలతో ముగియడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

 

Follow Us