Guinness World Record: సీడ్ బాల్స్‌ను రికార్డు స్థాయిలో తయారు చేసి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వెదజల్లడంతో పాలమూరు మహిళలు సరికొత్త రికార్డు సృష్టించారు. అంతేకాదు, సీడ్ బాల్స్‌తో అత్యంత పొడవైన వాక్యాన్ని నిర్మించడం ద్వారా గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు. దీనికి సంబంధించిన జ్జాపికను శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందుకున్నారు. హరిత హారం స్పూర్తితో, పచ్చదనం పెంపు కోసం గ్రీన్ ఛాలెంజ్ సంస్థ కృషిని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు.
అంతేకాదు, సీడ్ బాల్స్ తయారీలో సరికొత్త గిన్నీస్ రికార్డ్ నెలకొల్పిన మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగానికి, పాలమూరు మహిళా సమాఖ్యల కృషిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సమైక్య పాలనలో వలసలకు ఆకలి చావులకు నిలయమైన పాలమూరు జిల్లా స్వయం పాలనలో పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా అందిస్తున్న సాగునీటి జలాలతో నేడు ఎటు చూసినా పచ్చని పంటలతో కనువిందు చేస్తున్నదన్నారు కేసీఆర్.
బీడు భూములు, రాళ్లు, గుట్టలకే ఇన్నాళ్లూ పరిమితమై ఉన్న పాలమూరు పచ్చదనంతో తన రూపు రేఖలను మార్చుకుని, వినూత్న రీతిలో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుండడం సంతోషకరమని సీఎం పేర్కొన్నారు. కాగా, తెలంగాణకు హరిత హారం స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని స్వయం సహాయక బృందాలు గత ఏడాది నెలకొల్పిన 1.18 కోట్ల సీడ్ బాల్స్ తయారీ రికార్డును అధిగమించి.. ఈసారి కేవలం 10 రోజుల్లో 2.08 కోట్ల సీడ్ బాల్స్‌ను తయారు చేసి గిన్నీస్ రికార్డు సృష్టించాయి. ఈ 2.08 సీడ్ బాల్స్‌ను జిల్లాలోని వివిధ ప్రదేశాలలో వెదజల్లారు తద్వారా పుడమితల్లిని చల్లగా ఉంచేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు.
Read also: Minister Jagdish Reddy: కిషన్ రెడ్డిది ప్రజలను మోసం చేసే యాత్ర.. మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు