CM KCR: దమ్ముంటే తేదీని ఖరారు చేయండి.. నేను అసెంబ్లీని రద్దు చేస్తా.. విపక్షాలకు సీఎం కేసీఆర్‌ సవాల్‌

|

Jul 10, 2022 | 8:51 PM

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు,..

CM KCR: దమ్ముంటే తేదీని ఖరారు చేయండి.. నేను అసెంబ్లీని రద్దు చేస్తా.. విపక్షాలకు సీఎం కేసీఆర్‌ సవాల్‌
Telangana Cm Kcr
Follow us on

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. అలాగే ప్రజలు పలు ఇబ్బందులకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా  కేసీఆర్‌ విపక్షాలకు సవాల్‌ విసిరారు. ముందస్తు ఎన్నికలు వస్తే నేను కూడా అసెంబ్లీని రద్దు చేస్తా.. దమ్ముంటే ఎన్నికల తేదీ ఖరారు చేయండి..అంటూ కేసీఆర్‌ విపక్షాలకు సవాల్‌ విసిరారు. బీజేపీ, కాంగ్రెస్‌లు దమ్ముంటే డేట్‌ డిక్లరేషన్‌ చేయాలన్నారు.

ఇటీవల హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన జాతీయ స్థాయి సమావేశాలపై స్పందించారు. మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. దేశాన్ని బీజేపీ జలగల్లా పట్టిపీడిస్తోందని, మోడీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని విమర్శించారు. బీజేపీ జాతీయ సమావేశాల్లో మోడీ ప్రసంగం వల్ల పెద్దగా ఒరిగిందేమి లేదని, పెద్దగా మాట్లాడిందేమి లేదని వ్యాఖ్యానించారు. సభలో కేంద్ర మంత్రులు కేసీఆర్‌ను తిట్టడానికే పరిమితం అయ్యారని మోడీ ఏదో చేస్తారనుకుంటే ఏమి లేదన్నారు. కేంద్రం అసమర్థ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ తెలంగాణకే కాదు.. దేశానికి కూడా చేసిందేమి లేదని, ఎనిమిది సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం ఏమి సాధించలేకపోయిందన్నారు.

తెలంగాణలో జరిగిన అభివృద్ధి కనీసం బీజేపీ 20 శాతమైనా చేసిందా అని ప్రశ్నించార కేసీఆర్‌. కేంద్రంలో నాన్‌ బీజేపీ సర్కార్‌ వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, బీజేపీయేతర రాష్ట్రాల్లోనే అభివృద్ధి కనిపిస్తోందన్నారు. కేంద్రం ప్రభుత్వం దేశానికి చేసిందేమి లేదని, పైగా తెలంగాణ రాష్ట్రంపైనే విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని దించుతాం..

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే నాన్‌ బీజేపీ రాష్ట్రాల్లోనే తలసరి ఆదాయం మెరుగ్గా ఉందన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్‌ను ఎంచుకోవడం రాంగ్‌ రూట్‌ అంటూ వ్యాఖ్యానించారు.