నగరంలో వరద సహాయం పంపిణీ కొనసాగుతుందని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. గతంలో వచ్చిన దరఖాస్తులనే పరిశీలించి.. వారి వారి ఖాతాల్లో రూ.10 వేలు చొప్పున జమ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం పెండింగ్ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందన్నారు. అయితే ఇప్పటి వరకు దరఖాస్తు చేయని వారికి సహాయం ఎలా అందించాలన్న దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని, ఆ తరువాత వారికి కూడా సాయం పంపిణీ చేస్తామన్నారు. కాగా, గత రెండు రోజుల్లో 17,333 మంది లబ్దిదారులకు రూ.17.33 కోట్లు పంపిణీ చేశామని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. ఇదిలాఉండగా, జీహెచ్ఎంసీ ఎన్నికల కారణంగా వరద సాయం పంపిణీ కార్యక్రమం నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం బాధితులకు వరద సాయం పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.