
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్ పల్లెలు కొత్తిమీర సాగుకు కేరాఫ్ గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్య పంటలైన పసుపు, మొక్కజొన్న జొన్న పంటలను ఇక్కడి రైతులు సాగు చేస్తారు. అయితే ఆరుతడి పంటగా గత కొన్నేళ్ల నుండి కొత్తిమీరను కూడా సాగుచేస్తున్నారు రైతులు. ఈ పంటతో వేసవికాలంలో సైతం అధిక దిగుబడి సాధిస్తున్నారు. ఇక్కడ పండించిన కొత్తిమీరకు రాష్ట్ర మార్కెట్ లోనే కాదు పక్క రాష్ట్రాల్లోనూ భారీ గా డిమాండ్ ఉంది. దీంతో ఈ పంట రైతులకు సిరులు కురిపిస్తుంది. ఈ చిన్నరకం పంట అంకాపూర్ కేంద్రంగా జరిగే కొత్తిమీర మార్కెట్ నుండి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. జస్ట్ 30 రోజుల్లోనే లక్షల సంపాదనతో సంప్రదాయం పసుపు పంటలో ఏర్పడే నష్టాన్ని కొత్తిమీర ద్వారా వచ్చిన లాభాలతో పూరించుకుంటారు ఇక్కడి రైతులు
కొత్తిమీర సాగు విధానం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో రైతులు కొత్తిమీర పంటను అధికంగా పండిస్తున్నారు. జూన్ మాసంలో పసుపు పంటను విత్తుకుంటారు. తొమ్మిది నెలలు పంటను పండిస్తారు అనంతరం పసుపు తవ్వకాలు చేసి దుక్కి దున్ని నేలను చదును చేసుకుంటారు. కొత్తిమీర పంటను వేయడానికి ట్రాక్టర్ సహాయంతో గెరలు వేసి ధనియాలను విత్తుకుంటారు. విత్తిన నాటిన ముప్పై నుండి నలభై రోజుల్లోనే పంట చేతుకొస్తుంది. అయితే పంటలకు తెగుళ్లు రాకుండా విత్తుకున్న ఇరవై రోజులకు మందులను పిచికారి చేస్తారు. దీంతో ఇది అధిక దిగుబడిని ఇస్తుంది.
తక్కువ సమయం.. ఎక్కవ ఆదాయం
అయితే పసుపు పంట తీసిన రైతులు గతంలో నువ్వులు సాగు చేసే వారు. దాని టైంతో పాటు కష్టం కూడా ఎక్కుగా ఉండడంతో ప్రస్తుతం అందరూ తక్కువ సమయంలో ఎక్కవ ఆదాయం ఇచ్చు కొత్తిమీరకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్తమీర పంటలో ఉన్న మరో అడ్వాంటేజ్ ఏమిటంటే.. తమ పంటను అమ్మేందుకు రైతులు మార్కెట్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు.. వ్యాపారులే రైతుల వద్దకు వచ్చిన పంటను కొనుగోలు చేస్తారు. ఇలా ఈ పంటపై రైతు రూ.15-20 వేల పెట్టుబడి పెడితే.. రూ.లక్షల వరకు ఆధాయం వస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.