AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు..

ఒకే వేదిక, ఒకే ముహూర్తం.. ఇద్దరు కవల అన్నదమ్ములు, ఇద్దరు కవల అక్కాచెల్లెళ్ల మెడలో మూడు ముళ్లు వేసి అరుదైన జంటలుగా వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు చూసి మురిసిపోని వారు లేరు. కానీ అది మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఉగాది పండుగ పూట వెలుగులు నింపాల్సిన ఇంట్లో, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వినయ్ కుమార్ ఆత్మహత్యతో చీకటి అలముకుంది.

Telangana: ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు..
Software Engineer Vinay Kumar Ends Life Kamareddy
Krishna S
|

Updated on: Mar 21, 2026 | 9:14 AM

Share

సరిగ్గా నెల రోజుల క్రితం ఆ గ్రామం ఒక అరుదైన వేడుకకు సాక్ష్యంగా నిలిచింది. ఇద్దరు కవల అన్నదమ్ములు, ఇద్దరు కవల అక్కాచెల్లెళ్లను పెళ్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లి పీటల మీద మెరిసిన ఆ నవ్వులు, నెల తిరగకముందే కన్నీళ్లయ్యాయి. కామారెడ్డి జిల్లా మాచిరెడ్డిపల్లి మండలం ఘనపూర్* గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా పెను విషాదాన్ని నింపింది. ఘనపూర్ గ్రామానికి చెందిన కవల సోదరులు దుంపటి విజయ్, దుంపటి వినయ్ కుమార్ గత నెలలో దేమికలాన్‌కు చెందిన కవల సోదరీమణులు కీర్తన, కీర్తిలను వివాహం చేసుకున్నారు.

మళ్లీ తిరగిరాలేదు

ఉగాది పండుగ కావడంతో తన భార్యతో కలిసి స్వగ్రామమైన ఘనపూర్‌కు వచ్చాడు వినయ్. అందరితో కలిసి పండుగ జరుపుకోవాల్సిన ఆ యువకుడు, గురువారం నాడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. చివరకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు కాలువ వద్ద వినయ్ ఆచూకీ లభ్యమైంది. అయితే అప్పటికే ఆయన కాలువలో దూకి ప్రాణాలు విడిచినట్లు గుర్తించారు.

కవలల బంధంలో చీకటి ఛాయలు

కవలలు అంటేనే ఒకరి ప్రాణం మరొకరికి అని అంటారు. తనతో పాటే పుట్టి, తనతో పాటే ఒకే వేదికపై పెళ్లి చేసుకున్న సోదరుడు విజయ్, వినయ్ మరణంతో తట్టుకోలేకపోతున్నాడు. అటు భార్య కీర్తి పరిస్థితి వర్ణనాతీతం. పట్టు వస్త్రాలు ఆరకముందే చేతికి ఉన్న పారాణి చెరిగిపోకముందే భర్తను కోల్పోయిన ఆమె శోకం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.

ఈ వివాహం జరిగినప్పుడు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యింది. కవలలు కవలలను పెళ్లి చేసుకోవడం ఒక విశేషమైతే, వారు ఎంతో అన్యోన్యంగా ఉండటం చూసి అందరూ ముచ్చటపడ్డారు. కానీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ మంచి భవిష్యత్తు ఉన్న వినయ్, పెళ్లయిన నెల రోజులకే ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కొత్తగా పెళ్లయిన వినయ్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. పండుగ పూట ఘనపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Follow Us