
ఇప్పటివరకు ఓటీపీ అడిగి, వాట్సాప్ లింకులు పంపించి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు మరో కొత్త మోసానికి తెరలేపారు. ప్రజలు అప్రమత్తం కావడంతో తమ పాత ట్రిక్స్ పని చేయడం తగ్గిపోయిందని గ్రహించిన డిజిటల్ మోసగాళ్లు ఇప్పుడు మరింత తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా మీ ఇంటికే కొత్త మొబైల్ ఫోన్ పార్శిల్ పంపించి ఖాతాల్లోని డబ్బును మాయం చేస్తున్నారు. సరికొత్త హైటెక్ స్కామ్‌గా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సైబరాబాద్ పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఉచితంగా వచ్చిన ఫోన్‌లో సిమ్ వేసి ఆన్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షల రూపాయలు ఖాతా నుంచి మాయం కావడం కలకలం రేపుతోంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్‌కు చెందిన 44 ఏళ్ల వ్యాపారవేత్త ఈ మోసానికి బలయ్యాడు. ముందుగా ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ప్రముఖ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ విభాగానికి చెందిన రిలేషన్‌షిప్ మేనేజర్‌నని పరిచయం చేసుకున్నాడు. బాధితుడికి రూ.50 లక్షల లిమిట్‌తో ప్రత్యేక క్రెడిట్ కార్డు మంజూరైందని నమ్మించాడు. అయితే కార్డు యాక్టివేషన్‌కు టెలికాం వెరిఫికేషన్ అవసరమని చెప్పి, ప్రస్తుతం వాడుతున్న ఈ-సిమ్ సరిపోదని, కొత్త ఫిజికల్ సిమ్ తీసుకోవాలని సూచించాడు. దీంతో బాధితుడు కొత్త సిమ్ తీసుకున్నాడు. అక్కడితో ఆగని నిందితులు… బ్యాంక్ స్టిక్కర్లు అంటించిన ఓ కొత్త మొబైల్ ఫోన్‌ను నేరుగా ఇంటికే పంపించారు. ఆ ఫోన్‌లో కొత్త సిమ్ వేసి 24 గంటలు వెరిఫికేషన్ కోసం ఉపయోగించాలని సూచించారు. కానీ బాధితుడికి తెలియకుండా ఆ మొబైల్‌లో ముందుగానే ప్రత్యేక ఎస్ఎంఎస్ ఫార్వార్డింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసి ఉంచారు.
బాధితుడి మొబైల్‌కు వచ్చే బ్యాంక్ మెసేజ్‌లు, ఓటీపీలు అన్నీ నేరుగా సైబర్ ముఠా చేతుల్లోకి వెళ్లేలా సెట్ చేశారు. ఆ తర్వాత బాధితుడి రెండు బ్యాంక్ ఖాతాల నుంచి విడతలవారీగా భారీ మొత్తంలో నగదు ట్రాన్స్‌ఫర్ చేశారు. మొత్తం రూ.77 లక్షలకుపైగా మాయం కావడంతో బాధితుడు షాక్‌కు గురయ్యాడు.నుమానం వచ్చి బ్యాంక్ ఖాతాలు చెక్ చేయగా డబ్బు మాయం అయినట్టు గుర్తించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్ ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఈ మోసం వెనుక పెద్ద ముఠా ఉన్నట్టు తేలింది. పశ్చిమ బెంగాల్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు గుర్తించారు. నెలరోజుల పాటు గాలింపు చేపట్టిన ప్రత్యేక బృందాలు మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. నిందితుల వద్ద నుంచి లక్షల రూపాయల నగదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సిమ్ కార్డులు, బ్యాంక్ స్టిక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు ఇంకా ఇతర రాష్ట్రాల్లోనూ సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్లు, ఉచిత గిఫ్ట్‌లు, వెరిఫికేషన్ పేరుతో వచ్చే డివైజ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని సూచిస్తున్నారు. తెలియని మొబైల్ ఫోన్లలో వ్యక్తిగత సిమ్ కార్డులు వేయకూడదని, బ్యాంకింగ్‌కు సంబంధించిన వివరాలు ఎవరికీ చెప్పవద్దని హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.