నల్లమలలో నీలి రంగు వింత… ఈ మొక్క గురించి తెలిస్తే ఆశ్చర్యం..
నల్లమల అడవుల్లో అరుదైన వృక్ష, మొక్కల జాతులు ఎన్నో ఉన్నాయి. వాటిలో రోథెకా సెర్రాటా ప్రత్యేకమైనది. నీలం నుంచి వయొలెట్ రంగుల్లో గుత్తులుగా పూసే పుష్పాలతో ఆకట్టుకునే ఈ మొక్క పర్యావరణపరంగానే కాకుండా సంప్రదాయ ఔషధ ప్రాధాన్యతను కూడా కలిగి ఉంది.

నల్లమల అడవులు అనగానే పులులు, చిరుతలు, జింకలు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులే ముందుగా గుర్తుకొస్తాయి. అయితే ఈ అడవి కేవలం వన్యప్రాణులకు మాత్రమే నిలయం కాదు.. ఎన్నో అరుదైన వృక్ష, మొక్కల జాతులకు కూడా ఆవాసం. ఔషధ గుణాలు కలిగిన అనేక మొక్కలు నల్లమల అడవుల్లో కనిపిస్తాయి. అలాంటి ప్రత్యేక మొక్కల్లో రోథెకా సెర్రాటా ఒకటి. నీలం నుంచి వయొలెట్ రంగులో గుత్తులుగా పూసే పూలతో ఈ మొక్క అడవిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
నీలం.. వయొలెట్ రంగుల్లో పూల అందం
లామియేసీ కుటుంబానికి చెందిన రోథెకా సెర్రాటాను నీలి పుష్పాల మహావృక్షంగా పిలుస్తారు. ఈ మొక్కకు ఎదురెదురుగా ఉండే సరళమైన ఆకులు ఉంటాయి. ఆకుల అంచుల్లో చిన్నపాటి కోతల మాదిరి ఆకృతి కనిపిస్తుంది. అయితే ఈ మొక్కకు ప్రధాన ఆకర్షణ దాని పూలే. నీలం నుంచి వయొలెట్ రంగుల్లో పూసే పుష్పాలు గుత్తులుగా కనిపిస్తూ అడవి అందాన్ని మరింత పెంచుతాయి. తేమ అధికంగా ఉండే ఉష్ణమండల అడవులు, అడవిలోని లోతట్టు ప్రాంతాలు ఈ మొక్క పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. నల్లమలలోనూ తగిన తేమ, నేల పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో రోథెకా సెర్రాటా కనిపిస్తోంది.
జీవవైవిధ్యానికి చిన్న మొక్క.. కీలక పాత్ర
అడవిలో కనిపించే ప్రతి మొక్కకు పర్యావరణ వ్యవస్థలో ఏదో ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది. రోథెకా సెర్రాటా కూడా ఇందుకు మినహాయింపు కాదు. దీని పూలు కీటకాలు, ఇతర పరాగసంపర్క జీవులకు తేనె, పుప్పొడిని అందిస్తాయని జీవశాస్త్రవేత్త రవికాంత్ తెలిపారు. పూల కోసం వచ్చే కీటకాలు ఇతర మొక్కల పరాగసంపర్కానికి కూడా సహకరిస్తాయని ఆయన వివరించారు. దీంతో రోథెకా సెర్రాటా వంటి పుష్పించే మొక్కలు అడవిలో జీవవైవిధ్యాన్ని కొనసాగించడంలో పరోక్షంగా కీలక పాత్ర పోషిస్తాయి. ఒక మొక్క చిన్నదిగా కనిపించినా.. దాని చుట్టూ అనేక జీవుల కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయని రవికాంత్ పేర్కొన్నారు.
ఔషధ ప్రాధాన్యత కూడా..
పర్యావరణపరంగానే కాకుండా రోథెకా సెర్రాటాకు సంప్రదాయ ఔషధ ప్రాధాన్యత కూడా ఉంది. స్థానిక, సంప్రదాయ వైద్య విధానాల్లో ఈ మొక్కలోని వివిధ భాగాలను ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. దీంతో నల్లమల అడవుల్లో కనిపించే ఇలాంటి స్థానిక వృక్షజాతులను సంరక్షించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
వన్యప్రాణులతో పాటు వృక్షజాతులకూ రక్షణ
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో పులులు, చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంరక్షణకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. వాటికి ఆవాసంగా నిలిచే అడవిలోని చెట్లు, మొక్కలు, పొదలు, పుష్పించే జాతుల సంరక్షణకూ అంతే ప్రాధాన్యత ఉంది. నల్లమల అడవి ఒక జీవవైవిధ్య భాండాగారం. అక్కడ కనిపించే ప్రతి మొక్క ఏదో ఒక జీవికి ఆహారంగా, ఆశ్రయంగా లేదా జీవనాధారంగా మారుతుంది. నీలిరంగు పూలతో ఆకట్టుకునే రోథెకా సెర్రాటా కూడా ఈ అద్భుతమైన అటవీ వ్యవస్థలో తనదైన పాత్ర పోషిస్తోంది. నల్లమల అడవి ప్రత్యేకత పులుల అడుగుజాడల్లోనే కాదు.. అరుదైన మొక్కలు, ఔషధ వృక్షాలు, పుష్పించే జాతుల ఉనికిలోనూ దాగి ఉంది.
