
నల్గొండ ఎక్స్ రోడ్డు వద్ద సోహైల్ వెవ్స్ హోటల్ సమీపంలో ఓ కారు డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ఘటన దబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాత్రి వేళ వేగంగా వెళ్తున్న కారు నియంత్రణ కోల్పోయి నల్గొండ ఎక్స్ రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. అదృష్టవశాత్తు ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.. కాకపోతే కారు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారంతో హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదానికి గురైన కారును పరిశీలించారు.
అతి వేగం లేదా మద్యం సేవించి వాహనం నడపడమే ప్రమాదానికి కారణం కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అనంతరం ప్రమాదానికి గురైన వాహనాన్ని క్రేన్ సహాయంతో డివైడర్ మీద నుంచి తొలగించారు. ఈ ప్రమాదం రాత్రి వేళ జరగడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు చెబుతున్నారు. పగటి పూట జరిగి ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో చూడండి..
రోజూ ఎక్కడో చోట జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిల్ పోలీసులు, సిబ్బంది ఖచ్చితంగా వాహనదారులను అప్రమత్తం చేస్తుండాలని అంటున్నారు. మరీ ముఖ్యంగా రాత్రి సమయాల్లో చెకింగ్ అనేది నగరాల్లాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా అమలు చేయాలని చెబుతున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు తేలితే వెంటనే చర్యలు చేపట్టాలని, వాహనాన్ని సీజ్ చేయాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.