
సాటి మనుషులపై లేని ప్రేమ… ఇప్పుడు పెంపుడు జంతువులపైనా కనిపిస్తోంది. పెంపుడు జంతువులను కన్న బిడ్డల వలె చూసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పెంపుడు జంతువు అంటే కొందరికి అది కేవలం జంతువు కాదు.. కుటుంబ సభ్యుడే. అలాంటి పెంపుడు జంతువులు కనిపించకపోతే.. ఇంట్లో చిన్నపిల్లాడు తప్పిపోయినంత ఆవేదన చెందుతుంటారు. తప్పిపోయిన తన పెంపుడు జంతువు కోసం పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కిన యాజమాని ఇంకా ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. యాంత్రిక జీవితంలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. మనుషుల మధ్య ప్రేమలు, ఆప్యాయతలు కరువవుతున్నాయి. దీంతో చాలామంది పెంపుడు జంతువులతో అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన గడ్డం నాగరాజు జంతు ప్రేమికుడు. తన ఇంట్లో ముద్దుగా కుక్కను పెంచుకుంటున్నాడు. పెంపుడు కుక్కను కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఒకరిగా భావిస్తుంటారు.
అయితే తన పెంపుడు కుక్క ఈనెల 18వ తేదీ నుండి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులంతా వెతికినా జాడ దొరకలేదు. తానుండే కాలనీలోని సిసి కెమెరాలను పరిశీలించాడు. అయితే చర్చి రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద పెంపుడు కుక్కను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు గమనించాడు. పెంపుడు కుక్క కనిపించక పోయేసరికి… ఇంట్లో చిన్నపిల్లాడు తప్పిపోయినంత ఆవేదన చెందాడు. దీంతో నాగరాజు.. తన పెంపుడు కుక్క కోసం నేరుగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. పెంపుడు కుక్కను గుర్తించి అప్పగించాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులకు నాగరాజు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కూడా ఈ ఫిర్యాదును నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఇంతటితో ఆగలేదు.. కుక్క ఆచూకీ చెప్పిన వారికి ప్రైజ్ మనీ కూడా ప్రకటించాడు. తన పెంపుడు కుక్కను వెతికి అప్పగించిన వారికి రూ.10 వేల నగదు బహుమతి ఇస్తానంటూ ప్రకటించాడు. ప్రైజ్ మనీ విషయాన్ని నాగరాజు తన వాట్సాప్ స్టేటస్ లో నాగరాజు పెట్టుకున్నాడు.
సాధారణంగా పోయిన వస్తువులు, వాహనాలు, వ్యక్తుల కోసం పోలీసులకు ఫిర్యాదులు వస్తుంటాయి. కానీ పెంపుడు కుక్క కోసం ఫిర్యాదు చేయడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఇప్పుడు అందరి ప్రశ్న ఒక్కటే… ఆ పెంపుడు కుక్క మళ్లీ తన యజమాని చెంతకు చేరుతుందా?.. లేదా..? పోలీసులు కేసును చేధిస్తారా..? లేదా..? అనేది వేచ్చి చూడాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..