Bjp vs Trs: బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు టీఆర్‌ఎస్ MLC కవిత. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తూ జై శ్రీ రాం అంటున్న బీజేపీకి పోటీగా.. మనం జై హనుమాన్ అనాలని పిలుపునిచ్చారు కవిత. దేవుడి పేరుతో రాజకీయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో MLC కవిత ప్రసంగించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, అందరి అకౌంట్లలో 15 లక్షల రూపాయల లాంటి హామీలు ఏమయ్యాయని బీజేపీని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి, బీజేపీని ఎందుకు విమర్శించరని అన్నారు. పసుపు బోర్డు, ధరల పెరుగుదల పై బీజేపీని ఎందుకు నిలదీయడం లేదన్నారు. ఇద్దరి మధ్య ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల విమర్శకులకు దీటుగా సమాధానం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలిచిన ఎంపీ అరవింద్‌కు 3 ఏళ్లు అవకాశం ఇచ్చినా రైతులకు ఏం చెయ్యలేదని విమర్శించారమె. పసుపు బోర్డు బదులు తెచ్చిన ఆఫీస్ కూడా తాను ఇచ్చిందేనని కవిత్ చెప్పారు. టీఆర్ఎస్ చేసిన పనులు కూడా వాళ్లే చేసినట్లు బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. అబద్ధాలకు ప్రతిరూపం అరవింద్ అని ధ్వజమెత్తారు ఎమ్మెల్సీ కవిత. అమెరికా వెళ్లినా.. అబద్ధాలను వదలడం లేదని అరవింద్ తీరును విమర్శించారు. మోదీ హయాలో పెట్రోల్ నుంచి నిత్యావసర వస్తువుల వరకు అన్నింటి ధరలు భారీగా పెరిగాయన్నారు. రూపాయి విలువ భారీగా పడిపోయిందని విమర్శించారు. ‘‘కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి, బీజేపీని ఎందుకు విమర్శించరు? పసుపు బోర్డు, ధరల పెరుగుదల పై బీజేపీని ఎందుకు విమర్శించరు? మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందేమో?’’ అని అనుమానం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ నాయకులు రైతు రచ్చబండ నిర్వహిస్తే టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూపించండి అంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కవిత. తెలంగాణకు రావాల్సిన బకాయిల గురించి పార్లమెంటులో మాట్లాడాలని రాహుల్ గాంధీని కోరాల్సిందిగా జీవన్ రెడ్డిని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారామె.