BRS: బీఆర్ఎస్ అసంతృప్తులకు చెక్.. ఎమ్మెల్యేలు రాజయ్య, ముత్తిరెడ్డితో కేటీఆర్‌ సంప్రదింపులు.. కీలక పదవులు..!

|

Sep 23, 2023 | 10:23 AM

BRS Party: ఆగస్ట్‌ 21న 115 మంది BRS అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్‌ కేసీఆర్‌.. పెండింగ్‌లో ఉన్న సీట్లపై ఫోకస్ పెట్టారు. BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌ ఇవ్వకున్నా.. పార్టీ ప్రకటించిన అభ్యర్థికి సహకరించాలని ముత్తిరెడ్డికి మంత్రి కేటీఆర్‌ సూచించారు.

BRS: బీఆర్ఎస్ అసంతృప్తులకు చెక్.. ఎమ్మెల్యేలు రాజయ్య, ముత్తిరెడ్డితో కేటీఆర్‌ సంప్రదింపులు.. కీలక పదవులు..!
Minister K Taraka Rama Rao
Follow us on

BRS Party: సీఎం కేసీఆర్ BRS అభ్యర్థులను ప్రకటించిన నాటినుంచి పెండింగ్‌లో ఉన్న సీట్లపై ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా ముందుగా అసంతృప్తులను బుజ్జగించేందుకు కేటీఆర్ ను రంగంలోకి దించారు. దీంతో BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అసంతృప్త నేతలతో మాట్లాడి.. వారి డిమాండ్లను క్లియర్ చేస్తున్నారు.  ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ తో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌ ఇవ్వకున్నా.. పార్టీ ప్రకటించిన అభ్యర్థికి సహకరించాలని ముత్తిరెడ్డికి మంత్రి కేటీఆర్‌ సూచించారు. ప్రత్యామ్నాయంగా గౌరవ పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. జనగామ టిక్కెట్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీలో గ్రూపు రాజకీయాలకు కేటీఆర్‌ చెక్‌ పెట్టారు. కడియం శ్రీహరికి టిక్కెట్‌ ప్రకటించడంపై కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే రాజయ్య తనకే మళ్లీ టికెట్ వస్తుందని ప్రచారం చేస్తూ వచ్చారు. దీంతో అధిష్టానం జోక్యం చేసుకుని వారి మధ్య రాజీ కుదర్చింది.

కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు అందించి, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజయ్య ప్రకటించారు. ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో రాజయ్య ఈ ప్రకటన చేశారు. రాజయ్యకు పార్టీ అండగా ఉంటుందని, ఆయనకు సముచితమైన స్థానం కల్పిస్తుందని సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్యకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. అటు తనకు సంపూర్ణ మద్దతు తెలిపిన రాజయ్యకు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు.

TSRTC చైర్మన్‌గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యను నియమించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కూడా పార్టీ రాజీనామా చేయడంతో.. ఆ స్థానంలో మరో అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది.

ముఖ్యంగా అసంతృప్త నేతలపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ అధిష్టానం.. ఆ దిశగా ముందుకు పోతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అసంతృప్త నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్న కేటీఆర్, కవిత, హరీష్ రావు.. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసానిస్తున్నారు.

ఇదిలాఉంటే.. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి పదవిని ఇవ్వనుండటంతో.. పల్లా రాజేశ్వర్ రెడ్డికి జనగామ టికెట్ కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..