Telangana: తెలంగాణలోనూ మేఘాలయ తరహా మర్డర్..?

మేఘాలయ హనీమూన్ హత్య ఘటనను గుర్తుచేసేలా జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన నెల రోజులకే తేజేశ్వర్ అదృశ్యమయ్యాడు. ఐదు రోజుల తర్వాత అతడు శవమై కనిపించడం కలకలం రేపుతోంది. ఈకేసులో భార్యపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్‌..! ఇంతకీ తేజేశ్వర్‌ను హత్య చేసింది ఎవరు.. ఇది సుపారీ మర్డరా..?

Telangana: తెలంగాణలోనూ మేఘాలయ తరహా మర్డర్..?
Telangana Murder Case

Updated on: Jun 23, 2025 | 7:26 AM

హనీమూన్ మర్డర్. ఇప్పుడు ఈ అంశం చాలా సంచలనం. ఉత్తరాదిలో జరిగిన ఈ ఉదంతంపై దేశమంతా చర్చ జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ఎందుకు… ఆ తరువాత హత్యలు చేయడం ఎందుకు అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. లేటెస్ట్‌గా తెలంగాణలోనూ సేమ్ టు సేమ్ ఇదే రకమైన హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కొద్దిరోజుల క్రితం తేజేశ్వర్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. ఐదు రోజుల తర్వాత అతడు విగతజీవిగా కనిపించాడు. ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ నెల 17న అదృశ్యమైన తేజేశ్వర్

గద్వాలలో లైసెన్స్ సర్వేయర్‌గా పనిచేస్తున్న తేజేశ్వర్.. ఈనెల 17న అదృశ్యమయ్యాడు. ఏదో పని ఉండి వెళ్లి ఉండొచ్చని.. రేపోమాపో వచ్చేస్తాడని కుటుంబసభ్యులు అనుకున్నారు. కానీ రోజులు గడుస్తున్నా అతడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవటంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని పిన్నాపురం గ్రామ శివారులో అతడు దారుణ హత్యకు గురైనట్లు తెలిసి అంతా షాక్‌కు గురయ్యారు. తేజేశ్వర్‌కు గత మే 18న కర్నూలుకు చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే పెళ్లైన నెల రోజులు కూడా కాకముందే ఈ ఘోరం జరగడంతో తేజేశ్వర్ భార్యపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తన తమ్ముడిని కిరాయి హంతకులకు హత్య చేయించారని ఆరోపిస్తున్నాడు తేజేశ్వర్ సోదరుడు తేజవర్ధన్. ఆయన భార్యపైనే తమకు అనుమానం ఉందంటున్నాడు. ఆమె తల్లిపైనా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. తన సోదరుడి హత్య తర్వాత.. తమకూ ప్రాణభయం ఉందంటున్నాడు తేజవర్ధన్.

హత్య వెనుక ఓ బ్యాంక్ మేనేజర్ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు కుటుంబసభ్యులు. అతన్ని విచారిస్తే.. అసలు విషయం బయటపడుతుందని అంటున్నారు.

కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు

కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఈ నెల 17న కిడ్నాప్ అయ్యాడని చెప్పారు. ప్రేమ, పెళ్లి పేరుతో తేజేశ్వర్‌ను నమ్మించి హత్య చేసిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని తేజేశ్వర్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..