
అతడి పేరు శేక్షావలి. ఓ చిరు వ్యాపారి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన అతడు గత నెల మేడారం జాతరలో కేవలం పది రూపాయలకే కోవా బన్ విక్రయిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చేసేది చిరు వ్యాపారం.. పైగా వచ్చే లాభాలు తక్కువే. ఇక సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో మీరూ చూసే ఉంటారు. ఓ యూట్యూబర్ అతడి వద్దకు వెళ్లి.. కోవా బన్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేయడమే కాదు.. తక్కువ ధరకు ఎలా అమ్ముతున్నావ్.. ఇందులో నాణ్యత లేదు. ఏదో కల్తీ చేసి ఉంటావ్ అంటూ ప్రశ్నలు సంధించాడు. ఆధార్ కార్డు, ఎక్స్‌పైరీ డేట్ అడిగాడు, ఇంగ్లీష్‌లో మాట్లాడి భయపెట్టాడు అతడిని. దీంతో కొందరు జనాలు చుట్టూ చేరి.. శేక్షావలి బండిని పూర్తిగా ద్వంసం చేశారు. ఈ సంఘటన శేక్షావలికి, అతని కుటుంబానికి తీవ్ర నష్టాన్ని మాత్రమే కాదు మనోవేదనను కూడా కలిగించింది. అటు ఈ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అవడంతో.. ప్రజలు ఆ యూట్యూబర్ తీరుపై తీవ్రంగా స్పందించారు. పెద్ద పెద్ద బ్రాండ్లు డిస్కౌంట్ల రూపంలో నాసిరకం అందిస్తుంటే.. అడిగే దమ్ములేదు.. చిన్న వ్యాపారిపై మీ ప్రతాపమా అంటూ విరుచుకుపడ్డారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా ఈ వీడియోపై స్పందించి.. శేక్షావలికి మద్దతుగా నిలిచారు.
ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై శేక్షావలి స్పందించాడు. మేడారం జాతరలో వందలాది మంది తనను చుట్టుముట్టి, సరుకు నాణ్యతను ప్రశ్నించారని తెలిపాడు. ఆధార్ కార్డు, ఎక్స్‌పైరీ డేట్ అడిగారని, ఇంగ్లీష్‌లో మాట్లాడి భయపెట్టారని చెప్పుకొచ్చాడు. సరుకు నాణ్యమైనదని నిరూపించడానికి, వందల మంది ముందు తానే స్వయంగా కోవా బన్ను తిని చూపినట్లు, ఆ సమయంలో వాళ్ల సూటిపోటి మాటలను తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజలు తనను చెట్టుకు కట్టేస్తామని బెదిరించారని, చాలా భయపడ్డానని తెలిపాడు. ఈ సంఘటన జరిగిన రోజునే తాను మేడారం నుంచి తిరిగి వచ్చానని, ఆ తర్వాత పది రోజుల పాటు వ్యాపారం చేయలేక ఇంట్లోనే ఉండిపోయానని చెప్పాడు. తన కుటుంబ సభ్యులు కూడా ఈ ఘటనతో తీవ్రంగా కుమిలిపోయారని, వ్యాపారం చేయలేకపోవడంతో ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లిందని అతడు వివరించాడు. దాదాపు లక్ష రూపాయల విలువైన కోవా బన్నులు ధ్వంసం అయ్యాయని, పెట్రోల్ ఖర్చులు కూడా కలిపి ఈ నష్టం జరిగిందని పేర్కొన్నాడు.
అటు శేక్షావలి సోదరుడు జావేద్ మాట్లాడుతూ.. కల్తీ ఆరోపణలకు తోడు, తాగుబోతులు కొందరు పుకార్లు వ్యాప్తి చేసి, తమను ఇబ్బందులకు గురిచేశారని తెలిపాడు. ఘటన తర్వాత బయట తిరగాలన్నా కూడా తమపై కల్తీ ముద్ర పడిందేమో అనే భయం వెంటాడుతోందని, శివరాత్రి జాతరకు వెళ్లాలనుకున్నా, మళ్ళీ అలాంటి సంఘటనే జరుగుతుందేమోనని భయపడి వెళ్లలేదని వివరించాడు. కుటుంబం నాణ్యమైన కోవా బన్నులనే విక్రయిస్తుందని నిరూపించడానికి, శేక్షావలి వెలుగోడులోని తన స్వగ్రామంలో కోవా తయారీ ప్రక్రియను చూపించాడు. ఐదు లీటర్ల స్వచ్ఛమైన బర్రె పాలు, కిలోన్నర చక్కెర, పావు కిలో బొంబాయి రవ్వ కలిపి, కట్టెల పొయ్యిపై సుమారు గంట సేపు నిరంతరం కలుపుతూ మూడు కిలోల కోవా తయారు చేస్తామని చెప్పాడు. ప్యాకెట్ పాలు కాకుండా, తమ ఊర్లో సేకరించిన స్వచ్ఛమైన పాలను మాత్రమే ఉపయోగిస్తామని స్పష్టం చేశాడు. తమ కుటుంబం 80 సంవత్సరాలుగా కోవా తయారీలో ఉందని స్పష్టం చేశాడు.
రాయలసీమకు చెందిన షేక్ షావలి ఇటీవల జరిగిన మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకుంటుండగా ఒక మతోన్మాద యూట్యూబ్ చానెల్ వారు ఆయన మీద తప్పుడు ప్రచారం చేశారు.
అయితే ఒక చిరువ్యాపారి మీద ఈ దుర్మార్గానికి పాల్పడ్డ మతోన్మాదుల మీద సోషల్ మీడియాలో వ్యతిరేకత వెల్లువెత్తింది. షేక్ షావలికి అండగా… pic.twitter.com/aBJZoykNVT
— Konatham Dileep (@KonathamDileep) February 13, 2026