
మ్యాట్రిమోనీ, పెట్టుబడుల పేరుతో అమాయకులను ముంచేస్తున్న ఒక అంతరాష్ట్ర సైబర్ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు విజయవంతంగా రట్టు చేశారు. పెళ్లి కానుకలు, ప్రేమ పేరుతో వల వేసి ఏకంగా రూ. 1.46 కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన తెలంగాణకు చెందిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితులు మొదట ‘సంగం మ్యాట్రిమోనీ’ వెబ్‌సైట్ ద్వారా బాధితుడికి పరిచయమయ్యారు. పెళ్లి చేసుకుంటామని నమ్మించి, ప్రేమ పేరుతో దగ్గరయ్యారు. ఆ తర్వాత తాము అధిక లాభాలు గడించే ఒక ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెడుతున్నామని, నకిలీ లింకులను పంపించి బాధితుడితో రూ. 46.65 లక్షల వరకు పెట్టుబడి పెట్టించారు. తీరా లాభాలు వచ్చాక ఆ డబ్బును వెనక్కి అడగడంతో, టాక్స్, అదనపు ఛార్జీల పేరుతో మరికొంత డిమాండ్ చేస్తూ మొత్తం రూ. 1.46 కోట్లు కాజేశారు.
బాధితుడి నుండి వసూలు చేసిన సొమ్మును నిందితులు మహారాష్ట్ర, తెలంగాణల్లోని పలు మ్యూల్ బ్యాంక్ ఖాతాలకు మళ్లించారు. కేవలం కమిషన్ల కోసం సైబర్ మోసగాళ్లకు సహకరించిన ఈ నలుగురు, ఆ అకౌంట్ల నుండి డబ్బును విత్‌డ్రా చేసి హవాలా మార్గంలో సింగపూర్‌లోని ప్రధాన సైబర్ నేరగాళ్లకు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుండి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియా, మ్యాట్రిమోనీ సైట్లలో కొత్తగా పరిచయమయ్యే వ్యక్తుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆన్‌లైన్‌లో అధిక లాభాలు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో వచ్చే నకిలీ ఆఫర్లను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..