Telangana: రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. హైదరాబాద్-వరంగల్ రూట్‌లో రద్దీకి శాశ్వత చెక్..

హైదరాబాద్–వరంగల్ మార్గంలో ప్రయాణించే వేలాది మంది నిత్య ప్రయాణికులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణకు ప్రత్యేకంగా రూ.2,419 కోట్లతో 4వ లైన్ కేటాయించడంతో పాటు దక్షిణ భారతదేశంలో రైల్వే వ్యవస్థను సరికొత్త స్థాయికి తీసుకెళ్లే మెగా ప్రాజెక్టుల వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. హైదరాబాద్-వరంగల్ రూట్‌లో రద్దీకి శాశ్వత చెక్..
Ghatkesar Kazipet 4th Railway Line

Updated on: Sep 09, 2026 | 9:27 PM

భారతీయ రైల్వేలను ఆధునీకరించి, ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేబినెట్ కమిటీ దేశవ్యాప్తంగా 8 భారీ మల్టీట్రాకింగ్ లైన్లకు ఆమోదం తెలిపింది. దాదాపు రూ.20,804 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులన్నింటినీ 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి చేయాలనేది రైల్వేశాఖ ప్రణాళిక. ఇందులో సింహభాగం ప్రాజెక్టులు దక్షిణాదికే దక్కడం విశేషం.

తెలంగాణ రవాణా రంగానికి కొత్త దన్ను- ఘట్‌కేసర్–కాజీపేట 4వ లైన్

హైదరాబాద్–వరంగల్ కారిడార్‌లో ఏళ్ల తరబడి నెలకొన్న రద్దీ సమస్యకు పరిష్కారంగా ఘట్‌కేసర్ నుండి కాజీపేట వరకు 110 కిలోమీటర్ల మేర 4వ ట్రాక్ నిర్మాణాన్ని కేంద్రం ఖరారు చేసింది. దీనికోసం ప్రత్యేకంగా రూ.2,419 కోట్లను కేటాయించింది. ప్రధాన నగరాల మధ్య నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు ఈ ప్రాజెక్ట్ ఒక తీపి కబురు. సింగిల్, డబుల్ ట్రాక్ వల్ల రైళ్లు నిలిచిపోయే పరిస్థితి తప్పుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట, భువనగిరి వంటి ప్రాంతాలకు చేరడం సులువవుతుంది. ఈ అదనపు లైన్ ద్వారా ఏటా దాదాపు 9.83 మిలియన్ టన్నుల సరకు రవాణా అదనంగా సాధ్యమవుతుంది. ఇందులో 7.06 మిలియన్ టన్నుల బొగ్గు, 0.73 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం, 0.65 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 0.13 మిలియన్ టన్నుల సిమెంట్ రవాణాకు వెసులుబాటు కలుగుతుంది.

మోదీ నాయకత్వంలో తెలంగాణ రైల్వేలకు స్వర్ణయుగం: కిషన్ రెడ్డి

సికింద్రాబాద్-కాజీపేట ప్రాజెక్టుకు ఆమోదం లభించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్రం నుంచి రైల్వే బడ్జెట్ కేటాయింపులు ఏకంగా 21 రెట్లు పెరిగాయని చెప్పారు. గత 12 ఏళ్ల కాలంలో తెలంగాణ రైల్వే అభివృద్ధి కోసం రూ.36,286 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు రూ.50 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మరో రూ.50 వేల కోట్ల విలువైన పనులకు ఫైనల్ లొకేషన్ సర్వే కొనసాగుతోందని స్పష్టం చేశారు.

రూ.3 వేల కోట్లతో 42 అమృత్ భారత్ స్టేషన్లు

కేవలం ట్రాక్‌ల విస్తరణకే పరిమితం కాకుండా ప్రయాణికులకు ప్రపంచస్థాయి వసతులు కల్పించేందుకు రూ.3,000 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 42 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద ఆధునీకరిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. వీటిలో ఇప్పటికే 6 స్టేషన్లను ప్రధాని మోదీ ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌తో సహా అనేక ప్రాజెక్టులతో రాష్ట్ర రైల్వే ముఖచిత్రమే పూర్తిగా మారిపోయిందని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన వెల్లడించారు.

దక్షిణ భారతంలో రూపురేఖలు మారనున్న 5 మార్గాలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక పరిధిలోని 17 జిల్లాలను కలుపుతూ 5 ప్రత్యేక లైన్లను విస్తరిస్తున్నారు.

  • ఘట్‌కేసర్ – కాజీపేట (తెలంగాణ): 110 కి.మీల 4వ లైన్
  • అరక్కోణం – రేణిగుంట (ఏపీ/తమిళనాడు): 77 కి.మీ పరిధిలో 3, 4వ లైన్లు
  • వైట్‌ఫీల్డ్ – బంగారపేట (కర్ణాటక): 47 కి.మీ మేర 3, 4వ ట్రాక్‌లు.
  • హోసూరు – ఓమలూరు (తమిళనాడు): 147 కి.మీ డబ్లింగ్ పనులు.
  • సేలం – కరూర్ – దిండిగల్ (తమిళనాడు): 159 కి.మీ డబ్లింగ్ ప్రాజెక్ట్.

పర్యావరణానికి వరం.. 52 లక్షల మందికి మేలు

ఈ మెగా ప్రాజెక్టుల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు రైలు సదుపాయం పెరగడంతో పాటు రోడ్డుపై సరకు లారీల రద్దీ తగ్గుతుంది. ఫలితంగా 2,121 గ్రామాలకు నేరుగా రైలు మార్గం అనుసంధానమవుతుంది. రోడ్డు మార్గంపై ఒత్తిడి తగ్గి, ఏటా 8 కోట్ల లీటర్ల విలువైన ఇంధనం ఆదా అవుతుంది. వాతావరణంలోకి విడుదలయ్యే 42 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలు నియంత్రణలోకి వస్తాయి. ఇది సుమారు రెండు కోట్ల చెట్లను నాటడంతో సమానమైన పర్యావరణ ప్రయోజనం. రోడ్డు రవాణాతో పోలిస్తే రైల్వేల ద్వారా సరకు రవాణా చౌక కావడంతో వ్యాపార వ్యయం తగ్గి అంతిమంగా వినియోగదారులకే మేలు జరుగుతుందని కేంద్రం వెల్లడించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us