మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి మధ్య ప్రోటోకాల్ రగడ కలకలం రేపింది. ఓడినోళ్లను స్టేజ్‌పైకి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. అసలేం జరిగిందంటే..? సిద్దిపేట హరిత హోటల్‌లో కొమురవెల్లి మల్లన్న జాతరపై సమీక్ష సమావేశం జరిగింది.. అందరూ వేదికపై ఆసీనులయ్యారు. అజెండా మొదలవకుండానే అభ్యంతరాలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ నేత కొమ్ముూరి ప్రతాప్ రెడ్డిని స్టేజ్‌పైకి పిలవడంతో గొడవ మొదలైంది. ఇది ప్రభుత్వ కార్యక్రమా? కాంగ్రెస్ మీటింగా? అంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరర్ రెడ్డి ప్రశ్నించారు. ఈక్రమంలోనే మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ మీటింగ్‌లా నిర్వహిస్తున్నారని సమీక్ష సమావేశం నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. ప్రభుత్వ కార్యక్రమంలో కాంగ్రెస్ వ్యక్తిని స్టేజ్‌పైకి పిలవడం దురదృష్టకరమంటూ పల్లా రాజేశ్వర రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. మల్లికార్జున స్వామి జాతరలో దోచుకోవడానికే కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారని ఆరోపించారు. 30 ఏళ్ల చరిత్రలో ఓ హోటల్‌లో ఎప్పుడూ ఇలా సమావేశం పెట్టలేదని విమర్శించారు ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్ రెడ్డి. ఎన్నికైన ప్రజా ప్రతినిధులను వెళ్ళిపొమ్మనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మల్లన్న ఉత్సవాలలో ఖచ్చితంగా పాల్గొంటామన్నారు.
కాగా.. కొమురవెల్లి జాతర కోసం శాశ్వత ఏర్పాట్లు చేయటానికి, బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. జనవరి 7 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగనున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణమహోత్సవం, జాతర కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..