
మాజీ మంత్రి, రేవంత్ కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ చుట్టూ వివాదాలు వైఫైలా తిరుగుతుంటాయి. ఆమెకు కాంట్రోవర్సీలు అంటే ఇష్టమో లేక వివాదాలకు ఆమె అంటే ఇష్టమో తెలియదుగానీ, రెండుసార్లు చేజేతులా ఆమె మంత్రి పదవిని చేజార్చుకున్నారని చెబుతారు. కాంగ్రెస్‌లోనే కాదు, ఏ పార్టీలో ఉన్నా ఆమె కాంట్రోవర్సీలతో కాక రేపే పొలిటికల్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, ఇప్పుడు మళ్లీ అదే కాంగ్రెస్‌లో బర్తరఫ్ అయ్యేదాకా పరిస్థితిని తెచ్చుకున్నారు. ఆమె చుట్టూ గతం నుంచి ఇప్పటిదాకా ఉన్న వివాదాలు ఇప్పుడు తెలుసుకుందాం..
— గతంలో కాంగ్రెస్ నుంచి, BRSలోకి వెళ్లిన కొండా సురేఖ…అక్కడ కూడా ఇమడలేకపోయారని చెబుతారు. BRSలో కొనసాగినన్నాళ్లు ఎర్రబెల్లి దయాకర్‌రావుతో ఆమెకు వ్యక్తిగత శత్రుత్వం కొనసాగింది. కొండా దంపతులు, ఎర్రబెల్లి దయాకర్ మధ్య…ఎన్నో ఏళ్ల పాటు ఆధిపత్య పోరు, రాజకీయ శత్రుత్వం కొనసాగింది. ఇరువర్గాలు… వివాదాలు, ఆరోపణలు చేసుకునేవి. రాజకీయ సవాళ్లతో శివాలెత్తిపోయేవి. ఇక 2018లో టికెట్ రాకపోవడంతో, BRSకి గుడ్‌బై చెప్పి, కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు కొండా.
–అయితే కాంగ్రెస్‌లోకి వచ్చాక కూడా కొండా సురేఖ….సూరేకారంలానే వ్యవహరించారంటాయి వరంగల్ వర్గాలు. సీనియర్ నేత కడియం శ్రీహరితో ఆమెకు అస్సలు పడేదికాదని చెబుతారు. ఈ రెండువర్గాల మధ్య పోరుతో కాంగ్రెస్ కేడర్ బేజారయ్యారు. కడియం శ్రీహరిపై నిత్యం ఆరోపణలు, విమర్శలతో కొండా సురేఖ కాక రేపేవాళ్లు.
–ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఒక్కరంటే ఒక్కరితో కూడా కొండా దంపతులకు పడేది కాదని చెబుతారు. వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో మొదట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో ఎర్రబెల్లి స్వర్ణతో ఢీ అంటే ఢీ అన్నారు కొండా సురేఖ. ఆ తర్వాత ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరితో సురేఖ ఎడమొహం పెడమొహంగా ఉండేవాళ్లు. వాళ్ల మధ్య అధిష్టానం రాజీ కుదిర్చినా, కథ మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో కొండా సురేఖపై జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై భర్తతో కలిసి అధిష్టానానికి ఆమె కూడా ఫిర్యాదు చేశారు.
–ఇక కొండా సురేఖ పొలిటికల్ కెరీర్‌లోనే ఇది అతి పెద్ద వివాదంగా చెప్పుకోవచ్చు. సమంత, నాగచైతన్య విడిపోవడానికి BRS నేత కేటీఆర్ కారణమంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై అన్ని రాజకీయ పార్టీలూ మండిపడ్డాయి. చివరకు కాంగ్రెస్‌లో కూడా ఆమె వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. సినీ ప్రముఖులు కూడా కొండా వ్యాఖ్యలను ఖండించారు. కేటీఆర్ ఆమెకు లీగల్ నోటీసు పంపించడంతో విషయం కోర్టు దాకా వెళ్లింది. పొలిటికల్‌గా కేటీఆర్‌ను టార్గెట్ చేయాలనుకుని కొండా చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. చివరకు అతి పెద్ద రాజకీయ, న్యాయపరమైన వివాదంలో ఆమె పీకలదాకా ఇరుక్కుపోయారు.
–2025లో మేడారం పనులు, టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో సురేఖకు విభేదాలు బయటపడ్డాయి. తన శాఖ వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటున్నారన్న అభ్యంతరాలు సురేఖ నుంచి వచ్చాయి. ఈ వివాదం క్రమంగా కాంగ్రెస్‌లో అంతర్గత వర్గపోరుగా మారింది.
–ఇక పరకాల సీటు విషయంలో మొదలైన రచ్చ, చివరకు కొండా సురేఖ బర్తరఫ్ దాకా దారితీసింది. గతంలో కూడా ఇదే పరకాల సీటుపై కొండా సురేఖ కూతురు సుస్మిత ట్వీట్ చేయడం, అప్పట్లో కాంగ్రెస్‌లో హీట్ పుట్టింది. ఇప్పుడు కూడా అదే కాక రేపింది.
–2025లో కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆమె జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లిన ఘటన మరో పెద్ద వివాదానికి దారితీసింది. పోలీసులు సుమంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు రావడం, ఆ సమయంలో సురేఖ కుమార్తె సుస్మిత అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సన్నిహితులపై రాజకీయ కుట్ర ఆరోపణలు చేయడం తీవ్ర చర్చకు దారితీశాయి. సురేఖ క్యాబినెట్ సమావేశానికి గైర్హాజరు కావడంతో వ్యవహారం మరింత ముదిరింది.
–2009లో తన మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా చేశారు. వైఎస్ మరణం తర్వాత, జగన్‌ని సీఎం చేయకపోవడాన్ని నిరసిస్తూ, అప్పటి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ, తన పదవికి రాజీనామా చేశారు. 2009 అక్టోబర్ 29న మంత్రి పదవికి రాజీనామా చేశారు అప్పటి గవర్నర్ ఎన్.డి. తివారీకి రాజీనామా లేఖ అందజేశారు. ఆ తర్వాత జూలై 4, 2011న తన ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు.