Piyush Goyal: కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు..

|

Jul 20, 2022 | 9:02 PM

రాజకీయ అజెండాతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Piyush Goyal: కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు..
Piyush Goyal
Follow us on

Piyush Goyal on Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సహకరించడం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తీరుతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు పీయూష్ గోయల్ బుధవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ అజెండాతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పేదలకోసం ఎంతో తాపత్రయ పడుతోందని.. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. దేశంలో 80 కోట్ల మందికి ప్రతి నెల 5కిలోల చొప్పున అదనపు బియ్యం ఇస్తున్నామని.. పేదలకు ఉన్న హక్కు ప్రకారం వారికి ఆహార ధాన్యాలు అందాల్సిందేనని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం, మంత్రులు చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారని.. కేసీఆర్‌ అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శించారు. తెలంగాణలో ధాన్యం, బియ్యం సేకరించాలని కేంద్రం నిర్ణయించిందని పేర్కొన్నారు. ధాన్యం సేకరణపై FCI తెలంగాణకు క్లియరెన్స్ ఇస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ.. ప్రజలపై లేదని మండిపడ్డారు. ఎన్నిసార్లు లేఖ రాసినా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని.. బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తుందని పీయూష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వడ్లు, బియ్యం సేకరణ చేయాలని ఎఫ్‌సీఐకి అనుమతి ఇచ్చామని గోయల్ స్పష్టం చేశారు. ఏప్రిల్, మే నెలలో బియ్యం ఇవ్వకుండా పేదలకు అన్యాయం చేశారని, రైస్ మిల్లులో అక్రమాలు జరిగాయని గోయల్ వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణలో జరిగిన అవకతవకలపై తెలంగాణకు ఆడిట్‌ బృందాలను పంపించనున్నట్లు పీయూష్‌ గోయల్‌ స్పష్టంచేశారు. ప్రతిదీ రాజకీయం కాకుండా.. పేదల కోసం ఆలోచించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి గోయల్ సూచించారు.

ధన్యవాదాలు తెలిపిన బండి సంజయ్..

తెలంగాణలో బియ్యం సేకరణ (సీఎమ్మార్) చేయాలని ఎఫ్‌సీఐ (FCI) కి ఆదేశాలిచ్చినందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరివల్లే రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయంటూ బండి సంజయ్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. రైస్ మిల్లుల్లో ధాన్యం పాడైపోవడానికి ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యమేనని మండిపడ్డారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని 2 నెలల పాటు ఆపేయడం వల్లే రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని బీజేపీ తెలంగాణ చీఫ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినప్పటికీ.. తెలంగాణ ప్రజలను దృష్టిలో బియ్యం సేకరణకు అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని బండి సంజయ్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..