
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అప్లై చేసి.. లిస్ట్‌లో పేరు రాలేదా? అయితే మీకు గుడ్ న్యూస్. అప్లికేషన్ సమయంలో డిపాజిట్‌గా చెల్లించిన రూ.10 వేల మొత్తాన్ని హౌసింగ్ బోర్డు తిరిగి దరఖాస్తుదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. ఈ రిఫండ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుందని హౌసింగ్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసే సమయంలో ప్రతి ఒక్కరి నుంచి రూ.10 వేల చొప్పున ధరావతు మొత్తాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తులను వివిధ శాఖల రికార్డులతో క్రాస్ చెక్ చేసిన అధికారులు.. అర్హత లేని దరఖాస్తులను గుర్తించారు.
హైదరాబాద్‌లోని 16 నియోజకవర్గాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 60,720 దరఖాస్తులు వచ్చాయి. వీటిని రెవెన్యూ, రవాణా, జీహెచ్‌ఎంసీ తదితర శాఖల నుంచి సేకరించిన వివరాలతో అధికారులు వెరిఫై చేశారు. ఈ వెరిఫికేషన్‌లో భాగంగా 360 డిగ్రీల తనిఖీ చేపట్టిన హౌసింగ్ బోర్డు.. తొలి దశలోనే సుమారు 40 వేల దరఖాస్తులను అనర్హమైనవిగా గుర్తించింది. దీంతో అర్హత సాధించని వారికి వారు ముందుగా చెల్లించిన రూ.10 వేల మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు చర్యలు చేపట్టింది.
ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారుల్లో కొందరు అప్లికేషన్ సమయంలో తమ మొబైల్ నంబర్లను తప్పుగా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఫోన్ నంబర్ మార్చుకునే అవకాశం కల్పించాలని పలువురు లబ్ధిదారులు కోరారు. దీనిపై స్పందించిన అధికారులు తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోనే మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎంపికైన లబ్ధిదారులు తమ దరఖాస్తు నంబర్ లేదా ఆధార్ నంబర్ ఉపయోగించి అప్లికేషన్‌లోకి వెళ్లి వివరాలను మార్చుకోవచ్చు.
మరోవైపు హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన కుటుంబాలపై క్షేత్రస్థాయి సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 5,500 కుటుంబాలను అధికారులు నేరుగా పరిశీలించినట్లు సమాచారం. లబ్ధిదారుల వివరాలు, అర్హత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో చెక్ చేస్తున్న అధికారులు.. సర్వేను మరో రెండు రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత తుది జాబితాను సిద్ధం చేసి హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అంటే.. అర్హులైన వారికి ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ముందుకు వెళ్లనుండగా, అర్హత సాధించని దరఖాస్తుదారులకు మాత్రం వారి రూ.10 వేల డిపాజిట్ తిరిగి రానుంది.