Heavy Rain Alert: వానలు బాబోయ్‌.. వానలు! వచ్చే 3 రోజులు అతిభారీ వర్షాలు.. రెడ్‌ అలెర్ట్‌ జారీ

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 3 రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు వరదలు పోటెత్తాయి. మరోవైపు రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు..

Heavy Rain Alert: వానలు బాబోయ్‌.. వానలు! వచ్చే 3 రోజులు అతిభారీ వర్షాలు.. రెడ్‌ అలెర్ట్‌ జారీ
Telangana Rains

Updated on: Aug 17, 2025 | 4:36 PM

హైదరాబాద్, ఆగస్ట్‌ 17: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 3 రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు వరదలు పోటెత్తాయి. మరోవైపు రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు తెలంగాణ సెంట్రల్, ఈస్ట్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఇక హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురువనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. జంట నగరాల్లో వచ్చే 24 గంటల్లో 30 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఇప్పటికే వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతలం చేశాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడురోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొన్ని జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఆదివారం కొత్తగూడెం, హన్మకొండ, మహబూబాబాద్‌, ములుగు, వరంగల్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఇక ఆదిలాబాద్‌, జనగాం, భూపాలపల్లి, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

సోమవారం భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, సిద్దిపేట, వరంగల్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవనున్నాయి. మంగళవారం కూడా అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని అంచనా వేసింది. బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మేరకు వాతావరణ కేంద్రం ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం బలహీన పడనుంది. మరోవైపు అదే రోజు పశ్చిమ వాయువ్య దిశలో మరొక అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో ఈ వారమంతా విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.