Heat wave: నిప్పులు చిమ్ముతున్న భానుడు.. ఎండల తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, పిల్లలకు వాతావరణ శాఖ అలెర్ట్

| Edited By: Anil kumar poka

Apr 22, 2022 | 3:48 PM

రెండు రోజులుగా నిప్పులు కురుస్తుండడంతో హైదరాబాద్‌ నగరవాసులు అల్లాడిపోతున్నారు. గురువారం మాదాపూర్‌లో అత్యధికంగా 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యింది.

Heat wave: నిప్పులు చిమ్ముతున్న భానుడు.. ఎండల తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, పిల్లలకు వాతావరణ శాఖ అలెర్ట్
Heat Wave
Follow us on

Telangana Weather: భానుడు ఉగ్రరూపం దాల్చాడు. భగభగమంటూ సూర్యుడు కోరలు చాస్తున్నాడు. ఏప్రిల్‌ మొదటి వారం నుంచే మొదలైన మంటలు.. రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్‌లో ఈ స్థాయిలో ఎండలు మండిపోవడం ఇదే మొదటి సారని వాతావరణ శాఖ ప్రకటించింది. ఎండలు మండిపోవడంతో ఉక్కపోత కూడా పెరిగిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. హైదరాబాద్‌(Hyderabad) నుంచి మొదలు కొని జిల్లాల వరకు ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉత్తర తెలంగాణ(North Telangana)లోని జిల్లా కేంద్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తోంది. జనం ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఉదయం 9 గంటలకే ఎండ వేడిమి తాళలేక ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఎక్కడికక్కడ రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మంచిర్యాల(Mancherial), కొత్తగూడెం జిల్లాల్లో 43 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. రాబోవు కొద్ది రోజుల్లో 45 నుంచి 48 వరకు నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్‌లోనే ఇంత ఎండలు మండిపోతుంటే ఇక మే, జూన్‌లలో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతోన్న ఉష్ణోగ్రతతో పిల్లలు, వృద్ధులు విలవిల్లాడుతున్నారు. ఉదయం నుంచే ఎండ ప్రభావం కనిపిస్తోంది. సాయంత్రం 6గంటలు దాటినా ఈ తీవ్ర ఏమాత్రం తగ్గడం లేదు. మరో వైపు వడగాలులు అధికమయ్యాయి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4గంటల వరకు జిల్లాలోని ప్రధాన వీధులన్నీ నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూను తలపిస్తున్నాయి.

రెండు రోజులుగా నిప్పులు కురుస్తుండడంతో హైదరాబాద్‌ నగరవాసులు అల్లాడిపోతున్నారు. గురువారం మాదాపూర్‌లో అత్యధికంగా 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యింది. బాలాజీనగర్‌, మైత్రీవనంలో, తిరుమలగిరి, అడ్డగుట్టలో 41.3, మౌలాలిలో 41.1, ప్రశాంత్‌నగర్‌, శ్రీనగర్‌కాలనీ, జుమ్మెరాత్‌ బజార్‌లో 40.9, మచ్చబొల్లారం, అల్కాపురి కామన్‌హాల్‌లో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండుతుండడంతో జనం బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. నగరంలో గురువారం సాయంత్రం పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం కాస్త రిలీఫ్ ఇచ్చింది.

రెండు, మూడు రోజులు ఎండలు విపరీతంగా ఉంటాయని పిల్లలు, వృద్ధులు ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని జిల్లా అధికారులు సూచించారు. ఎండలు పెరగడంతో వడదెబ్బ పొంచి ఉంది. ఏటా వడదెబ్బకు పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. మరోవైపు ఎండకు పలువురు అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రోజూ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. అతిసార, డయేరియా, వడదెబ్బ వంటి సీజనల్‌ వ్యాధుల నిర్మూలనకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.

Also Read: Viral: ఇంట్లో ఎవరూ లేరు వచ్చేమంది.. కింగ్‌లా అక్కడికి వెళ్లిన కుర్రాడికి దిమ్మతిరిగే షాక్..