
ఈశాన్య అరేబియన్ సముద్రం, దాని సమీపంలోని దక్షిణ పాకిస్తాన్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం కేంద్రం నుంచి ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. అయితే.. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. వచ్చే రెండు రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకించి ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడలో భారీ వర్షాలు కురుస్తాయని.. నేటి నుంచి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే.. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు.. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్షసూచన చేసింది. కొమురం భీం, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. మిగతా అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
రాగల రెండు మూడు గంటలలో సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది.
గురువారం అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో మోస్తరు-భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూగో, పగో, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..