
ప్రపంచంలోనే భారత్ మూడోవ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని.. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల అభ్యున్నతికి.. దోహదపడుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్.. 2047వరకు వికసిత్ భారత్ నిర్మాణ లక్ష్యంగా ఉందని.. ఇది ఆర్థిక శక్తిని మరింత బలోపేతం చేస్తుందని ప్రహ్లాద్ జోషి వివరించారు. హైదరాబాద్ నగరంలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ ను.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) జనరేషన్ నడుస్తున్న పరిస్థితుల్లో కొత్త సంస్కరణలు తీసుకువస్తున్నామని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ సుదీర్ఘ కాలం దేశాన్ని పరిపాలించినా.. ఇన్ని సంస్కరణలు చేయలేదన్నారు. ఇది భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని రూపొందించిన బడ్జెట్ అని.. ఇందులో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేశామని చెప్పుకొచ్చారు. అయితే.. కొంత మంది కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను విమర్శిస్తున్నారని.. తెలంగాణకు ఏమీ ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారని.. కానీ.. కేంద్రం తెలంగాణకు చాలా చేసిందని చెప్పారు. 5 వేల కిలో మీటర్ల జాతీయ రహదారులు ఇచ్చామని వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు నిధులతో పాటు గ్రాంట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. మోదీ పాలనలో 12 లక్షల కోట్లు ఇచ్చామన్నారు.
“ఆత్మ నిర్భర భారత్ కింద తెలంగాణలోని 42 రైల్వే స్టేషన్లు ఆధునికీకరించాం.. ఏడు హై స్పీడ్ రైల్ కారిడార్లలో.. మూడు హైదరాబాద్ కే కేంద్రం ఇచ్చింది.. కొన్ని పార్టీల నాయకులు తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. తెలంగాణ ప్రజల పట్ల మోదీకి ప్రేమ ఉంది. తెలంగాణ ప్రజలకు కూడా మోదీపైన ప్రేమ ఉంది.. వీబీ జీ రామ్ జీ పథకంతో.. ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేశారని తప్పుడు ప్రచారం చేశారు.. వీబీ జీ రామ్ జీకి బడ్జెట్లో గతం కంటే ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది..” అంటూ కేంద్ర మంత్రి వివరించారు.