హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి భారీగా నాలా రోడ్డు కుంగిపోయింది. గోషామహల్‌లో దారుసలామ్ నుంచి చాక్నావాడికి వెళ్లే రోడ్డు లో ప్లైవుడ్ దుకాణాల ముందు రోడ్డు కుంగిపోయింది. రోడ్డు కూలిపోయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కుప్పకూలిపోయింది. మంగళవారం రాత్రి 2గంటల ప్రాంతంలో ఇది జరిగింది. అర్థరాత్రి సమయం కావడంతో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. శివరేజ్ పెద్ద నాలా అతిపూరాతనమైనదని స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం కుంగిన ప్రదేశానికి 200వందల మీటర్ల దూరంలో గతంలో కూడా నాలా రోడ్డు డ్రైనేజ్ లో కూలిపోయింది.
2022 డిసెంబర్‌లోనూ ఈ మార్గంలో నాలా కూలిపోయిన ఘటన చోటు చేసుకుంది. కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు నాలాలో పడిపోయాయి. నాలాపై ఉన్న దుకాణాలు కూడా నాలాలో కుప్పకూలాయి. అప్పటి ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
ఈ వీడియోపై క్లిక్ చేయండి..
గతంలో 1980, 1990లలో కూడా ఈ నాలా కుప్పకూలిందని సమాచారం. అఫ్సర్ సాగర్, దారుసలాం, చాక్నవాడి , గోషామహల్ పోలీస్ స్టేడియం, ఉస్మాన్ గంజ్, గౌలిగూడ మీదుగా మూసీ నదిలోకి ఈ నాలా ద్వారా మురికి నీరు ప్రవహిస్తుంది. కానీ, అక్రమ నిర్మాణాలు, ఇష్టానుసారంగా నాలా ఆక్రమణల కారణంగా ఇప్పుడు నాలా ఎక్కడికక్కడ కుంగిపోతున్న దుస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు.