వారంతా కుటుంబసభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకు బయల్దేరారు. కానీ వారి ఆనందం ఎంతో సమయం నిలవలేదు. జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన బృందంలో.. ప్రమాదవశాత్తు నీట మునిగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. తెలంగాణ(Telangana) కు చెందిన 16 మందితో కూడిన బృందం విహారయాత్ర కోసం కర్ణాటక(Karnataka) వెళ్లారు. కుశాలనగర్‌లో(Kushalanagar) బస చేశారు. పర్యాటకంలో భాగంగా ఇవాళ కోటే అబ్బి జలపాతం చూసేందుకు పయనమయ్యారు. సరదాగా నీటిలో దిగారు. లోతు అంచనా వేయకపోవడం, ప్రమాదాన్ని గుర్తించకపోవడంతో నీటిలో మునిగిపోయారు. నీటి ప్రవాహ ఉద్ధృతికి గల్లంతయ్యారు. ఘటన జరిగిన సమయంలో ఎవరూ గుర్తించకపోవడం, చుట్టుపక్కలా ఎవరూ లేకపోవడంతో వారిని రక్షించడం కష్టంగా మారింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం అగ్నిమాపక సిబ్బంది గాలించి, ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు శ్యామ, శ్రీహర్ష, షాహీంద్రగా గుర్తించారు. ఊహించని ఈ ఘటనతో మృతుల కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగి పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి