
హైదరాబాద్‌లో దాదాపు కోటి మందికిపైగా జనాలు నివసిస్తుండటంతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది. ఉదయం ఆఫీస్‌కు వెళ్లే వేళల్లో, సాయంత్రం ఆఫీస్ నుంచి తిరిగి వచ్చే సమయాల్లో అయితే ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉంటుంది. దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ఎక్కడిక్కకడ నగరంలో ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నాయి. దీని వల్ల ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. ఇప్పుడు నగరం నడిబొడ్డున ట్రాఫిక్ రద్దీగా ఉండే మరో ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది.
కేబీఆర్ పార్క్ వద్ద భారీగా ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. దీని వల్ల ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ పార్క్ చుట్టూ ఫ్ల్రైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. తాజాగా ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి జాతీయ హరిత ట్రిబ్యునల్(NGT) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలో పనులు ప్రారంభించేందుకు జీహెచ్‌ఎంసీ సన్నద్దమవుతోంది. రెండేళ్లల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండు దశల్లో ఈ పనులను యుద్ద ప్రాతిపదికన చేపట్టి వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటికే మట్టి పరీక్షలు జరుగుతుండగా.. టీడీపీ ఆఫీస్ నుంచి ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వరకు రెండు చోట్ల టెస్టులు నిర్వహించారు.
2017లో మొదటిసారి మట్టి పరీక్షలు నిర్వహించగా.. 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్లీ మట్టి పరీక్షలు జరుపుతున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. ఈ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు పూర్తయితే మాదాపూర్, హెటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్య ఉండదని, వేగంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని చెప్పారు. రూ.826 కోట్ల అంచానతో వై-టైప్ అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్లకు శ్రీకారం చుట్టారు. కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ నుండి రోడ్డు నంబర్ 36 వైపు 4 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇక ముగ్ధ జంక్షన్ వద్ద జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ నుండి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వైపు 2-లేన్ల అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు.