
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2026 ఏడాదికి సంబంధించి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. 2026 ఏడాదికి సంబంధించి ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డులకు 45మందిని ఎంపిక చేసింది. దీనికి సంబంధించి 25 జనవరి ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. పద్మశ్రీ అవార్డులు భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి.. వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, మొదలగు వాటిలో విశిష్ట సేవలకు గుర్తింపుగా ఏటా గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా ప్రకటిస్తారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక వేడుకలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాలు ప్రదానం చేస్తారు..
ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు పద్మ అవార్డులు వరించాయి. డాక్టర్ కుమారస్వామి తంగరాజ్‌కు పద్మశ్రీ వరించింది. హైదరాబాద్‌లోని CCMBలో పనిచేస్తున్న తంగరాజ్ కు.. జన్యుసంబంధ పరిశోధనలకు గాను పద్మశ్రీ అవార్డు దక్కింది.
తెలంగాణకు చెందిన మామిడి రామరెడ్డికి పద్మశ్రీ అవార్డు దక్కింది. పాడి, పశుసంవర్ధక విభాగాల్లో సేవలకు గుర్తింపు లభించింది.
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ తంగరాజ్.. జన్యుసంబంధిత పరిశోధనల్లో ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు. భారతీయ జనాభా జన్యు వైవిధ్యంపై ఆయన చేసిన లోతైన అధ్యయనాలు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. దక్షిణ ఆసియా ప్రజల పూర్వీకుల మూలాలను కనుగొనడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల నిర్ధారణలో ఆయన చేసిన కృషికి గానూ ఈ పద్మశ్రీ పురస్కారం లభించింది. ప్రస్తుతం ఆయన సి.డి.ఎఫ్.డి డైరెక్టర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.